ఆర్మూర్టౌన్, జూలై 23: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలుచేయాలని తెలంగాణ స్టేట్ కంట్రీబ్యూటరీ పింఛన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 23న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు సంబంధించిన పోస్టర్లను ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. రాత్రి పగలు కష్టపడి తీవ్రమైన పోటీని తట్టుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించుకుంటే, తమ బతుకులను ఈ పీఎఫ్ఆర్డీఏ అనే నల్ల చట్టం అంధకారంలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తంచేశారు.
సామాజిక భద్రత లేక చేతికి సర్వీస్ పింఛన్ అందక ఇప్పటికే రాష్ట్రంలో 3వేల మందికి పైగా సీపీఎస్ ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. సకాలంలో టీఏ, డీఏ, ఏరియర్స్ రావడం లేదని, ఉద్యోగ విరమణ తర్వాత ఈహెచ్ఎస్ అమలు కావడం లేదన్నారు. అసలు సీపీఎస్ ఉద్యోగుల ఉనికి నేడు ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. రాష్ట్రంలో 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. వారి కుటుంబ సభ్యుల సామాజిక భద్రత కోసం అందరూ ఒక తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నారని గుర్తుచేశారు. ఆగస్టు 23వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రావాలని పిలుపునిచ్చారు.