మామిళ్లగూడెం, జూలై 23 : ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పేద విద్యార్థుల సంక్షేమం మిథ్యగా మారింది. వసతి గృహాల్లో ఉంటూ సమీప ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటోంది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా వసతి గృహాల్లో ఉంటూ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 7,334 మంది విద్యార్థులు చదువుతున్నారు. హాస్టళ్లు ప్రారంభమై నెలరోజులు దాటినా ఇంతవరకు వారికి ముఖ్యమంత్రి కిట్లు(నిత్యావసర వస్తువులు), పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, దుప్పట్లు అందనేలేదు.
కనీసం కిటికీలకు దోమల జాలీలు లేవు.. మరుగుదొడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. శిథిల భవనాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న పేద విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. వసతి గృహాల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై అధికారులను ప్రశ్నించగా.. ‘ఆగస్టు 15 తర్వాత’ అన్ని సమస్యలు పరిష్కారమవుతాయంటూ సమాధానం చెబుతుండడం గమనార్హం.
పేద విద్యార్థుల చదువులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తున్నది. కనీస రోజువారీ అవసరాలైన సబ్బులు, కొబ్బరినూనె, షాంపులు తదితర వస్తువుల కిట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు ప్రతిరోజూ కిరాణ కొట్లకు పరుగెత్తాల్సిన దుస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి ప్రత్యేక కిట్లే కాదు.. ప్రతి విద్యార్థికి ఏడాదికి నాలుగు జతల యూనిఫామ్ ఇవ్వాల్సి ఉండగా వాటి జాడ కూడా కనిపించడం లేదు. నేలపై, బండల మీద పడుకుంటున్న పిల్లలకు కనీసం పక్క వేసుకునేందుకు, కప్పుకునేందుకు అవసరమైన దుప్పట్ల పంపిణీ మృగ్యంగా మారింది. విద్యార్థులకు ప్రతియేటా అందించాల్సిన ఒక జత బూట్లు, చెప్పుల పరిస్థితి అతీగతీ లేకుండాపోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో ‘కామన్ మెనూ’ కథ కంచికి చేరింది. గురుకులాల్లో దీని అమలు కొంతమేరకు కొనసాగుతున్నప్పటికీ సాధారణ వసతి గృహాల్లో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.
ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా శిథిల భవనాల్లోనే చిన్నారుల జీవనం బిక్కుబిక్కుమంటూ కొనసాగుతున్నది. వసతి గృహాల్లో భవనాల స్లాబు పెచ్చులు ఊడిపడడం నిత్యకృత్యంగా మారుతున్నాయి. ప్రహరీలు లేక కుక్కలు, పందులు స్వైరవిహారం చేస్తుండగా.. దోమలు, ఈగలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల దోమతెరలు లేవు.. కిటికీలు, డోర్లకు దోమల జాలీలు కనిపించడం లేదు. మరుగుదొడ్లు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 7,334 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 37 వసతి గృహాల్లో 3,111 మంది విద్యార్థులు ఉంటూ సమీప ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 20 వసతి గృహాలు ఉన్నాయి. వాటిల్లో 1,539 మంది చదువుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 ఆశ్రమ పాఠశాలల్లో 1,856 మంది విద్యార్థులకు వసతులతో కూడిన విద్యను అందిస్తుండగా.. సాధారణ వసతి గృహాలు 8 ఉన్నాయి. వాటిల్లో 828 మంది ఉంటున్నారు.
గురుకులాలతోపాటు సాధారణ వసతి గృహాల్లో విద్యార్థులకు ఒకే రకమైన మెనూ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అదే పద్ధతిలో విద్యార్థులకు డైట్ అండ్ కాస్మోటిక్ చార్జీలను పెంచినట్లు ఉత్తర్వులను జారీ చేశారు.. కానీ, అమలులో మాత్రం కనిపించడం లేదు. ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలు కలెక్టర్ పర్యవేక్షణలో ఇంకా పాత పద్ధతిలో మెనూ అమలు చేస్తుంటే.. గిరిజన సంక్షేమ శాఖ మాత్రం ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో నిర్ణయించిన మెనూ అమలు చేస్తున్నారు. సంక్షేమ శాఖల అధికారులు తమకు నచ్చినట్లుగా మెనూను మార్చుకుని విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులను ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం ఆగస్టు 15వ తేదీ వరకు ఆగాల్సిందే అంటూ సమాధానం చెబుతున్నారు.
ప్రహరీ లేకుండానే ఉన్న వసతి గృహం

ఇంకా ప్రారంభంకాని బీ హాస్టల్ స్టడీ అవర్(పై మూడు వసతి గృహాల్లో
వార్డెన్లు లేకపోవడంతో ఎవరికి వారే అన్నట్లుగా కూర్చున్న విద్యార్థులు

విద్యార్థులు బస చేసే గదిలో ఊడిపోయిన పెచ్చులు

గేట్లు తెరిచే ఉన్న కాంప్లెక్స్ వసతి గృహం

ప్రహరీ లేకుండానే ఉన్న వసతి గృహం

ఆరుబయట స్నానాలు చేస్తున్న చిన్నారులు

స్టడీ అవర్లో కూర్చున్న ఏ హాస్టల్ విద్యార్థులు