నాగిరెడ్డిపేట,జూలై 23: గ్రామంలోని విద్యార్థులు, యువకులకు విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మినీ గ్రంథాలయం నేడు రేషన్‌షాపుగా మారింది. మూడు నెలలుగా అందులో నుంచే రేషన్ పంపిణీ చేస్తుండడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 జూన్ 20న మండలంలోని పోచారం గ్రామంలో పాత గ్రామపంచాయతీ భవనంలో మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రంథాలయానికి కావల్సిన సామగ్రిని అందించారు.
గ్రామానికి చెందిన ఓ దాత పత్రికలకు సంబంధించి చందా చెల్లించాడు. గ్రంథాలయ నిర్వహణ కోసం ఒకరిని నియమించారు. రెండున్నరేండ్ల పాటు గ్రంథాలయాన్ని గ్రామంలోని యువకులు, వృద్ధులు, విద్యావంతులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత నిర్వహణ బాధ్యతలు చూసేవారికి జీతం ఇవ్వకపోవడంతో గ్రంథాలయాన్ని తెరవడం మానేశాడు. నాలుగు నెలలుగా గ్రంథాలయం మూసి ఉండడంతో ప్రస్తుతం దాన్ని రేషన్‌షాపుగా మార్చేశారు. గ్రంథాలయ సామగ్రిని మూ లన పడేశారు. వార్తపత్రికలను వృద్ధులు గ్రంథాలయ బయట కూర్చొని చదువుతుండడం గమనార్హం.
గ్రంథాలయాన్ని రేషన్‌షాపుగా మార్చడంతో అందులో ఉన్న పుస్తకాలు, పత్రికలు ఓ మూలన పడేసి బియ్యం సంచులను ఉంచారు. దీంతో పుస్తకాలన్నీ దుమ్ముపట్టి దర్శనమిస్తున్నాయి. నలుగురికి విజ్ఞానాన్ని అందించే విలువైన పుస్తకాలు దుమ్ముపట్టిపోయి ఉండడంపై పాఠకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రంథాలయాన్ని తిరిగి యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నారు.
గ్రంథాలయం ప్రతి ఒక్కరికీ విజ్ఞానం అందిస్తుంది. గ్రామంలో గ్రంథాలయం ఉందంటే విద్యావంతులు ఉన్నట్లు. మూసివేసిన గ్రంథాలయాన్ని తిరిగి యథావిధిగా కొనసాగించాలి.
-శ్రీకాంత్, గ్రామస్తుడు
విద్యార్థులు,యవకులకు పోటీ పరీక్షలు రాయడానికి లైబ్రరీ ఎంతో ఉపయోగపడుతుంది. గ్రంథాలయం దేవాలయంతో సమానం. వెంటనే తిరిగి ప్రారంభించాలి.
-దుర్గారెడ్డి, గ్రామస్తుడు
గ్రంథాలయం నిర్వాహకుడికి జీతం ఇవ్వకపోవడంతో అతను పని చేయడం మానేశాడు. అందులో తాత్కాలికంగా రేషన్ బియ్యం సంచులను ఉంచుతున్నాం.
-సంజీవ్‌రావు, సర్పంచ్