గజ్వేల్, జూలై 23: కాంగ్రెస్, బీజేపీ నేతలు తోడుదొంగలని, నీట్ పేపర్ లీకేజీపై నిరుద్యోగులు, విద్యార్థులు, యువత ప్రధాని మోదీపై యుద్ధం చేస్తుంటే ప్రతిపక్ష నేత రాహుల్ స్పందించకపోవడం దారుణమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 20రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష చేస్తుంటే ప్రతిపక్ష నేత రాహుల్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని ఇంటి ఎదుట ధర్నా చేస్తే ఆయనకే తెలియకపోతే దేశాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. ప్రధాని నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, శ్రీలంక, నేపాల్ తరహాలో ప్రధానిని తరిమికొడతారనే భయంతో ప్రతిపక్షనేత రాహుల్‌తో ధర్నా చేయించుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ బలపడితే కాంగ్రెస్, బీజేపీ ఉనికి ఎక్కడ కోల్పోతుందనే భయంతో ఉన్నారన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. రాముడి పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆలయ నిర్మాణంలో రూ.200కోట్ల అవినీతిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
12 ఏండ్లలో పేపర్ లీకేజీలు తప్పా చేసిందేమీ లేదన్నారు. రేవంత్‌రెడ్డి 32నెలల్లో రూ.4లక్షల కోట్ల అప్పు చేసి 33 జిల్లాలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఎక్కడా రిజర్వాయర్లు, కాల్వలు, పరిశ్రమల నిర్మాణం చేయలేదన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందే హెచ్చరించినా రేవంత్‌రెడ్డి ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నేడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించతలపెట్టిన సంఘీభావ నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నవాజ్, కౌన్సిలర్లు అత్తెల్లి శ్రీనివాస్, శ్రీధర్, బాబు, నాయకులు చంద్రమోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారెడ్డి, దయాకర్‌రెడ్డి, గుంటుక రాజు, కనకయ్య, రమేశ్‌గౌడ్, స్వామి, మల్లేశం,రాజిరెడ్డి, నరేశ్‌గౌడ్, మన్నె వెంకట్ పాల్గొన్నారు.