సిటీబ్యూరో/ఖైరతాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రతి ఏటా మాదిరిగానే వినాయక చవితి వేడుకలతో పాటు, ‘హుస్సేన్ సాగర్ నిమజ్జన’ ప్రక్రియపై నెలకొన్న సందిగ్ధత వీడడం లేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ , రసాయన రంగులతో తయారు చేసిన గణేశుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదంటూ న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు విరుద్ధంగా కనబడుతున్నాయి. ఒకవైపు కోర్టు తీర్పునకు కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు సాగర్ చుట్టూ ‘నో నిమజ్జనం’ ఫ్లెక్సీలు, 10 ఫీట్ల రెయిలింగ్ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ, మరోవైపు ట్యాంక్‌బండ్, పీవీ మార్గ్ వైపునకు నిమజ్జనోత్సవానికి అవసరమైన క్రేన్లు, ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే సోమవారం మెరుపు సంఖ్యలో భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అకడ గణేశ్ నిమజ్జనం చేయనివ్వబడదు అనే బోర్డులను, బ్యానర్లను ఉత్సవ సమితి సభ్యులు చింపివేశారు. అలాగే నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు పెట్టిన బారికేడ్లను తొలగించేందుకు యత్నించడంతో అకడ కొంతసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత ఏడాది కూడా చివరి వరకు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నిరసనలు చేపట్టాల్సి వచ్చిందని, ఈసారి కూడా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ స్పందించి వెంటనే ట్యాంక్ బండ్ వద్ద గణేశ్ నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 14న ప్రారంభమైన గణేశ్ నవరాత్రుల్లో పూజలందుకున్న విగ్రహాల మూడో రోజు నిమజ్జన ప్రక్రియ ఈ నెల 16 నుంచి ప్రారంభమైంది. వరుసగా 5వ, 7వ, 9వ రోజులతో పాటు ఈ నెల 25న తుది నిమజ్జనోత్సవం జరగనుంది. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టూ ఎన్టీఆర్ మార్గ్‌లో 17, అప్పర్ ట్యాంక్ బండ్ పై 20 క్రేన్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. బేబీ పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి పీవీ నర్సింహారావు మార్గ్ (నెక్లెస్ రోడ్), పీపుల్స్ ప్లాజాతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ కృత్రిమ కుంటలు (బేబీ పాండ్లు) ఏర్పాటు చేసింది.
వీటితో పాటు చిన్న విగ్రహాల కోసం నగరవ్యాప్తంగా బేబీ పాండ్లను సిద్ధం చేసి, వెంటనే అవశేషాలను తొలగించేలా క్రేన్లను ఏర్పాటు చేశారు. ఐతే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలు, భక్తుల నమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తామని, హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తామని భక్తులు, ఉత్సవ నిర్వాహకులు పట్టుబడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నా, ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నా… వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా హుస్సేన్‌సాగర్ వైపే అడుగులు వేస్తుండటంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వినాయక నిమజ్జనానికి సంబంధించి అధికారులు ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంపై సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు , ఎంఐఎం రజాకార్ ఎజెండాను అమలు చేస్తున్నారని భాగ్య నగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావి నూతల శశిధర్ ధ్వజమెత్తారు. గణేష్ నిమజ్జనం కోట్ల మంది విశ్వాసాలతో ముడిపడి ఉన్న కార్యక్రమని పేరొన్నారు. అధికారులు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, అందుకే తామే స్వయంగా నిమజ్జన ఏర్పాట్లను ప్రారంభించామని తెలిపారు. తమ విశ్వాసాలను, ఆచారాలను అడ్డుకోవద్దని, పోలీసులు మధ్యలో అడ్డుపడితే వచ్చే తీవ్ర పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నగరంలో దాదాపు 1,40,000 గణపతి విగ్రహాలు ఉన్నాయని, ఒకవేళ అధికారులు నిమజ్జనానికి సరిగ్గా సహకరించకపోతే, ఎకడి గణపతులకు అకడే శాశ్వతంగా మందిరాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
– రావి నూతన శశిధర్