న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్‌లో సోమవారం తమ క్లౌడ్ రీజియన్‌ను అధికారికంగా ప్రారంభించింది. దేశీయంగా కంపెనీకి ఇది నాల్గోది. కాగా, భారత్‌లో డిజిటల్, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ గతంలో 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఈ అమెరికన్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.
అందులో భాగంగానే ఈ హైదరాబాదీ క్లౌడ్ రీజియన్‌ను తీసుకొచ్చింది. నిజానికి గత నెల 6నే ఇది అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. ఇదిలావుంటే ఇప్పటికే దేశంలో పుణె, చెన్నై, ముంబై నగరాల్లో మైక్రోసాఫ్ట్‌కు ఇలాంటి క్లౌడ్ రీజియన్లే ఉన్నాయి. ఇప్పుడు వీటికి హైదరాబాద్ సెంటర్ తోడైంది.
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నెలకొల్పిన ఈ క్లౌడ్ రీజియన్ కూలింగ్‌కు నీటి అవసరమే లేకపోవడం విశేషం. ఇక్కడ సంప్రదాయ నీటి ఆధారిత వ్యవస్థలకు బదులుగా ఎయిర్-కూల్డ్ వ్యవస్థల్ని వినియోగించామని కంపెనీ భారతీయ, దక్షిణాసియా విభాగం అధ్యక్షుడు పునీత్ చందోక్ తెలిపారు. కాగా, 2035నాటికి 6-7 గిగావాట్లకు డాటా సెంటర్ల సామర్థ్యాన్ని చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఆ కల సాకారం అవుతుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా చందోక్ వెలిబుచ్చారు.
ఇప్పటికే దాదాపు 2 గిగావాట్ల సామర్థ్యం ఉన్నదని, 100 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడి హామీలున్నాయని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే భారత్.. ఆసియా, దక్షిణాది దేశాల ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా ఎదుగబోతున్నదన్న ధీమాను కనబర్చారు. ఇక హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటైన ఈ క్లౌడ్ రీజియన్.. భారతీయ సంస్థలకేగాక, వివిధ ఆసియా దేశాలకూ దన్నుగా ఉండగలదని ఓ వీడియో సందేశంలో మైక్రోసాఫ్ట్ వైస్ చైర్మన్, అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ అన్నారు.