శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 02:31:03

న్యాయవ్యవస్థ పై దాడి

న్యాయవ్యవస్థ పై దాడి

  • జస్టిస్‌ రమణపై సీజేఐకి వైస్‌ జగన్‌ లేఖ వెనుక కుట్ర 
  • వ్యక్తిగత స్వార్థంతోనే ఆరోపణలు
  • బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా  మండిపాటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్న సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సహా ఇతర న్యాయమూర్తులపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర అభ్యంతరకరమని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) మండిపడింది. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే న్యాయవ్యవస్థ స్వతంత్రతను సీఎం జగన్‌ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని బీసీఐ చైర్మన్‌ మనన్‌కుమార్‌ మిశ్రా గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. జస్టిస్‌ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టును ప్రభావితం చేస్తూ ప్రతిపక్ష టీడీపీ ప్రయోజనాలు కాపాడుతున్నారని సీజేఐ ఎస్‌ఏ బాబ్డేకు సీఎం జగన్‌ ఈ నెల 6న లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖను 10న మీడియాకు విడుదలచేయటం తీవ్ర వివాదాస్పదం అయింది. జగన్‌ చర్యపై న్యాయవాద సంఘాలు మండిపడుతున్నాయి.

కుట్రతోనే...

ఇటీవలి కాలంలో న్యాయవ్యవస్థను అస్థిరపర్చే ఘటనలు పెరిగిపోయాయని మనన్‌కుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో వివిధ వర్గాలనుంచి న్యాయమూర్తులపై విమర్శలు వచ్చేవని, ఇప్పుడు ఏకంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే విమర్శలు చేయటం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. కుట్రపూరితంగా న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, అందులో భాగంగానే సీఎం జగన్‌ రాసిన లేఖను మీడియాకు విడుదల చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నదని విమర్శించారు. న్యాయపాలనపై ప్రజావిశ్వాసాన్ని తగ్గించేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. జస్టిస్‌ రమణ తదుపరి సీజేఐ కాబోతున్నారని తెలిసే ఆయనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై చాలా క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. 

కుట్రలను తిప్పికొడతాం

న్యాయవ్యవస్థ గొప్పదనాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత బార్‌ అసోసియేషన్‌పై ఉన్నందునే ఈ అంశంపై స్పందిస్తున్నట్లు మనన్‌కుమార్‌ తెలిపారు. రాజకీయాలను నేరరహితం చేసే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్‌ ఎన్వీ రమణ పర్యవేక్షిస్తున్నారని, అందుకే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయపాలన, కోర్టుల విధి నిర్వహణ సక్రమంగా సాగాలంటే దురుద్దేశాలతో ఆటంకాలు కలిగిస్తున్న శక్తులను ఎదుర్కోవాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉన్నదని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విధుల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం తమకు లేదని, అయితే న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉన్నదని చెప్పారు. న్యాయవ్యవస్థపై కుట్ర జరిగితే తాము న్యాయమూర్తుల వెంట నిలుస్తామని స్పష్టంచేశారు. 

కోర్టు ధిక్కారమే

ఏపీ సీఎం జగన్‌ నిరాధార ఆరోపణలతో జస్టిస్‌ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా లేఖ రాయడం న్యాయ పరిపాలనలో జోక్యం చేసుకోవడమేనని ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ విమర్శించింది. జగన్‌ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి తప్పుడు చర్యలు కోర్టు ధిక్కారం కిందకి వస్తాయని అసోసియేషన్‌ పేర్కొంది. సీఎం జగన్‌ లేఖను సుప్రీంకోర్టు అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ తప్పుబట్టింది. న్యాయవ్యవస్థను దెబ్బతీసేందుకే కుట్రపూరితంగా లేఖ రాశారని గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

పెండింగ్‌ కేసుల్లో లబ్ధి కోసమే లేఖ:సీజేఐకి రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ నౌషద్‌ అలీ లేఖ

తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసుల్లో లబ్ధి పొందేందుకే ఏపీ సీఎం జగన్‌ న్యాయవ్యవస్థను తక్కువ చేసి చూపేలా ప్రయత్నిస్తున్నారని ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ నౌషద్‌ అలీ ఆరోపించారు. ఈ మేరకు సీజేఐ ఎస్‌ఏ బాబ్డేకు గురువారం లేఖ రాశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణపై నిరాధార ఆరోపణలు చేయడం న్యాయపరిపాలనలో జోక్యం చేసుకోవడమేనని విమర్శించారు. తన కేసులను విచారిస్తున్న ట్రయల్‌ కోర్టు జడ్జిలను ప్రభావితం చేయడానికే సుప్రీం న్యాయమూర్తిపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ను ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రత్యేక వ్యక్తిగా చూపించడానికి తాపత్రయపడుతున్నారని లేఖలో తెలిపారు. ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణను వేగవంతం చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆందోళన చెందిన సీఎం జగన్‌.. న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థ గొప్పతనాన్ని కాపాడేలా నిర్ణయం తీసుకోవాలని సీజేఐకి విజ్ఞప్తి చేశారు.