Python in bed : చేలల్లో, పొదల్లో పాములు (Snakes) కనిపించడం సాధరణమే. అప్పుడప్పుడు అవి దారితప్పి జనావాసాల్లోకి కూడా వస్తుంటాయి. కానీ తాజాగా ఓ పాము ఇంట్లోకి ప్రవేశించి ఓ యువకుడు నిద్రిస్తున్న పరుపులోకి దూరింది. ఉమ్మడి మహబూబ్నగర్ (Mahabub Nagar) జిల్లా పెబ్బేరు పట్టణంలోని చెలిమిళ్ల కాలనీలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏడడుగుల కొండచిలువ ఏకంగా పరుపులోకి దూరడంతో ఆ యువకుడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. పెళ్లూరు చెన్నకేశవులు ఆదివారం రాత్రి తన ఇంటి వరండాలో పరుపు వేసుకుని పడుకున్నాడు. తెల్లవారుజామున సుమారు 3 గంటల తర్వాత కుక్కలు అదేపనిగా అరవడం మొదలుపెట్టాయి. దాంతో నిద్రలేచిన చెన్నకేశవులు తన పరుపులో ఏదో కదులుతున్నట్టు గమనించాడు. వెంటనే లేచి పరిశీలించగా పెద్ద కొండచిలువ ఉంది. అదిచూసి భయంతో గట్టిగా కేకలు వేశాడు. అరుస్తూ తన పెదనాన్న సాయన్నను పిలిచాడు.
చెన్నకేశవులు కేకలు విన్న స్థానికులు గుమిగూడే సమయానికి కొండచిలువ పరుపులోంచి బయటకు వచ్చి మెట్లకిందకు వెళ్లింది. దాంతో మల్లేశ్ అనే యువకుడు వెంటనే వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్కు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఆయన సొసైటీ సభ్యులు చిలుక కుమార్ సాగర్, అవినాశ్లతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సొసైటీ బృందం అత్యంత చాకచక్యంగా ఆ ఏడడుగుల పొడవు, 13 కిలోల బరువున్న కొండచిలువను బంధించారు.
అనంతరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయ్ సమక్షంలో ఆ పామును పెద్దగూడెం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. వర్షాకాలంలో పాములు నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడైనా పాములు కనిపిస్తే వెంటనే నిపుణులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.