Children Stories | ఈ సుక్కల లెక్కల కతలు.. ఒక్కో బాసల ఒక్కో తీర్గ ఉంటయి. మునుపు బెంగాలీల సుక్కల కత జెప్పుకొన్నం. ఇది ఇందీల కత.. మీకు ఎర్కేగదుల్లా! పెద్ద పెద్దోళ్లకు తిక్కతిక్క పనులు మతిలకత్తయి. గమ్మతు గమ్మతు జేత్తరు. అసొంటిదే.. గీ కత. అకుబరు చక్రవర్తి ఒకపారి లాల్ఖిల్లా డాబా మీద పండుకుని.. మొగులు దిక్కు సూత్తుండట. మొగులు మీన సుక్కలన్ని మిలమిలాంట మెరుత్తున్నయి. ఏడ జూసినా మెరుపులే! అంతట్లకే ఆయినకు.. ‘మొగులు మీన ఎన్ని సుక్కలున్నయో!?’ అంట అనిపిచ్చింది. తెల్లారంగనే దర్బార్ల అందర్ని పిలిశి ఈ ముచ్చట జెప్పిండు. ముచ్చటినంగనే అందరు తాయిమాయి అయ్యిండ్లు. ఇది ఆయ్యే పని గాదని అందరికి ఎరుకనే! కని.. ఎవ్వలు గూడ ఎదురువోలె! మల్ల అకుబరే.. “లెక్క బరాబరి వెట్టినోళ్లకు వజ్రాలిత్త!” అంట జెప్పిండు.
రాజుతోని ముచ్చటనాయె! ఏమన్న కిందిమీదైతే మొదట్లకే మోసమైతదని ఎవ్వలుగూడ సప్పుడు జెయ్యలే. గానీ, బీరుబలు ముందటికొచ్చిండు. “సుక్కలు ఎన్నున్నయో లెక్కవెట్టి.. నెల దినాలల్ల జెప్త” అన్నడు. నెల రోజులైనంక మల్ల దర్బారు దీశిండు అకుబరు. సుక్కలు ఎన్నున్నయో ఎరుకైతదని ఆ దినాన సుట్టుపొంటి రాజులు సుత దర్బారుకు వచ్చిండ్లు. బువ్వ యాళ్లయినా.. బీరుబలు ఇంకా రాలేదు. సూడంగ సూడంగ నడి యెండల తిప్పల వడుకుంట.. నెత్తిమీద ఒకటి, రెండు శేతులల్ల రెండు ముల్లెలు వట్టుకొని అచ్చిండు. అచ్చుడుతోనే.. “లెక్క అయ్యెటాళ్లకు గీ యాళ్లయ్యింది. నేను సుక్కలన్ని లెక్కవెట్టిన హుజూర్! అయితే.. ఎన్నున్నయో లెక్కలల్ల రాసుడు నాతోని గాలె! గందుకే.. మొగులు మీన ఎన్ని సుక్కలున్నయో.. అన్ని ఆవాలు దెచ్చిన! ఎవలతోనన్న మీరే జర లెక్క రాయించుండ్రి!” అంట దండం బెట్టిండు. సుక్కలను లెక్కవెట్టుడు కాదనే ముచ్చట ఇకమతుతోని జెప్పిన బీరుబలుకు మంచి నజ్రానా ఇచ్చిండు అకుబరు!
… పత్తిపాక మోహన్
Children Stories | అరశేతుల ఎంటికలు ఎందుకు మొలవవో గమ్మతిగా జెప్పిన బీర్బల్
Children Stroies | తెనాలి రామలింగడి దగ్గరే డబ్బులు కొట్టేయాలని జూసి బొక్కబోర్లవడ్డ దొంగోడు
Children Stories | ఆపతికి.. సంపతికి పదిమంది ఉండాలె అనేందుకు ఈ కథే ఉదాహరణ
Children Stories | ఇకమతుల నక్క భూదేవి దగ్గరే అప్పు తీసుకొని.. కన్ను పోగొట్టుకుంది