Children Stories | మీకు అకుబరు, బీరుబలు కతలు ఎరుకే గదా! గమ్మతి గమ్మతి గుంటయి. అందుల కొన్ని తెలివి తేటలయి ఉంటయి.. ఇంకొన్ని పరాశికాలయి ఉంటయి. ఈ కత గూడ గసొంటిదే! ఇది ఇందీ కథ గని.. మనం మన బాసల జెప్పుకొందాముల్ల.
చెన్నాల్రామలింగంను కిష్ణదేవరాయలు ఎట్ల గొట్టుగొట్టుగ అడుగుతుండెనో.. అకుబరు గూడ బీరుబలును గట్లనే అడుగుతుండె. గట్లనె ఒకపారి అందరు దివానంల గూకొని ఉన్నరు. అందరు సలాం బెట్టినంక, అకుబరు.. “ఇగో బీరుబల్! నాకొక ముచ్చట దెల్సుకోవాలనుంది. నువ్వు మస్తు దిమాకున్నాయినెవు గదా! జరంత జెప్పు. నువ్వు అచ్చంగ జెప్తే ఇనాం గూడ ఇత్త” అన్నడు. బీరుబలుకు తప్పదాయె! “గట్లనే హుజూర్! అడుగుండ్లి.. కోషిశ్ జేత్త” అన్నడు బీరుబలు వంగివంగి సలాం జేసుకుంట. “ఏం లేదు! మస్తు దినాలకెల్లి నా మతిల ఓ ముచ్చటున్నది. ఎంతకు సమజయితలేదు. సోచాయించి.. సోచాయించి దిమాక్ ఖరాబ్ అయితంది. అందుకే ఆకరుకు నిన్నడుగుతున్న.
నా పెయ్యి మీద అన్ని తావులల్ల ఎంటికెలుంటయి గద.. అంటె నెత్తి మీద జుట్టు.. కండ్ల బొమ్మలు.. చాతి మీద, చేతి మీద, చెవుల మీద, ముక్కు మీద.. ఇట్ల ఒక్కోల్లకు ఒక్కోతాన ఉన్నయి గదా! మరి నా అరిశేతులల్ల ఎందుకు లెవ్వు!?” అంట అడిగిండు. బీరుబలు దిమాక్ ఎక్వ ఉన్నోడాయె. ఏదన్నా రాజుతోని ముచ్చటనాయె.. “హుజూర్! దానాలు శేశి శేశి.. మీ అరిశేతులల్ల ఎంటికలు మొలుత్తలేవు. మీ దానాలు గసోంటియి మరి” అన్నడు. అకుబరు గూడా తెలివితక్వోడేం గాకపాయె.. “గట్లనా.. అయితే మరి నీ శేతులల్ల ఎంటికలు ఎందుకు లేవు!?” అంట అడిగిండు. ఎంటనే బీరుబలు.. “హుజూర్! మీరిచ్చిన దానాలు పట్టిపట్టి నా శేతులల్ల గూడ మొలువలే! అంతా మీ దయ హుజూర్!” అంట అన్నడు. మస్తు మెచ్చిన అకుబరు బల్లె ఇనామిచ్చిండు బీరుబలుకు.
… పత్తిపాక మోహన్
Children Stroies | తెనాలి రామలింగడి దగ్గరే డబ్బులు కొట్టేయాలని జూసి బొక్కబోర్లవడ్డ దొంగోడు
Children Stories | ఆపతికి.. సంపతికి పదిమంది ఉండాలె అనేందుకు ఈ కథే ఉదాహరణ
Children Stories | ఇకమతుల నక్క భూదేవి దగ్గరే అప్పు తీసుకొని.. కన్ను పోగొట్టుకుంది
Children Stories | చెట్టుకు గుర్రం పుడితే.. చేపలు చెట్టెక్కినయ్