Children Stories |ఒక ఊర్లె ఒక ఆసామి ఉండెటోడు. ఏ కాలంల ఆ పంట గొని అమ్ముడు ఆయినె కశ్పి. ఊరూరు తిరిగెటానికి ఆయినెకో గుర్రం ఉండేటిది. ఆయినె అట్లనే దౌరల ఉండంగ గుర్రం పసిద్దయ్యే యాల్లయ్యింది. నిండు పొద్దులవడ్డ గుర్రాన్ని ఎక్కి తిరుగుడెందుకని.. దగ్గర్లున్న ఒక ఊర్లెకు వోయి ఓ ఆసామి ఇంటికాడ మకాం జేశి, గుర్రాన్ని ఆన్నే ఉన్న శెట్టుకు గట్టేశిండు. ఆ రాత్రిలనే గుర్రం ఈనింది. తెల్లారంగనే తల్లీపిల్లలను సూశిన ఆసామి మస్తు మురిశిపేయిండు. అంతట్లకే ఇంటి ఆసామచ్చి.. గుర్రం పిల్లను తోల్కవోయిండు. ఆసామి అడ్డంబోయి.. “అరె! అది నా గుర్రం పిల్ల. నువ్వెటు దోల్కపోతున్నవు?” అంట అడిగిండు. దానికి ఆయినె.. “ఎహే! ఇది నాదే” అనుకుంట రుబాబు జేశిండు. “అరె! ఇది నా గుర్రానికి వుట్టింది. నీదెట్లయితది?.. అది నాదే!” అంట మస్తుగ లొల్లివెట్టిండు ఆసామి. దానికి ఆ ఇంటాయినె.. “ఇది రాత్రి నా శెట్టుకు వుట్టింది.. గందుకని ఇది నాదే! తట్టా, బుట్టా సదుర్కోని ఈడికెల్లి వోతవా! ఇయ్యర మయ్యర జోపాల్నా” అంట గదుమాయించిండు.
పాపం.. ఆసామి ఆ ఊరోడు గాకపాయె! ఎవ్వలు ఈనె దిక్కు మాట్లాడెటోళ్లు లేరు. ఏంజెయ్యలేక బాధతోని ఊరికి పైనమైండు. పోంగ తొవ్వల ఆసామికి ఒక నక్క గలిశింది. “ఎందుకు నారాజ్గ ఉన్నవ్?” అని అడిగింది. కతంత జెప్పిండు. అంతా ఇని.. “నువ్వేం పరేషాన్ గాకు! పోయి కచ్చీర్ల పిర్యాజ్జేయి. నీ దిక్కు నేను వకాలత్ జేత్త” అని జెప్పింది. కచ్చీర్ పంచాయితికి తెల్లారి రమ్మని జెప్పింది. గుర్రాన్ని దీసుకున్న ఆసామిని, షికాయతు జేశినాయినెను కచ్చీర్లకు విలిశిండ్లు. తెల్లారంగనే అందరు అచ్చిండ్లు. గుర్రం పిల్లను దీసుకున్న ఆసామి.. తనదిక్కు మాట్లాడనీకె కొందరు ఊరోళ్లను దెచ్చుకున్నడు. లింగులిటుకుమంట అచ్చిన ఈనెను జూశి.. “నీ దిక్కు మాట్లాడనీకె ఎవ్వలు లేరా!?” అంట అడిగిండ్లు పంజులు. దానికాయినె.. “నా దిక్కు వకాలత్కు నా దోస్తు నక్క ఉంది. అడివిలకెల్లి రావాలె గద, జెర్రంత సమయం బడ్తది. అత్తది” అని జెప్పిండు. ఎంత శేపైనా నక్క రాలే! సూశీసూశీ యాట్టకచ్చిన పంజులు.. “ఇదేం కత.. నక్క ఇంకెప్పుడత్తది” అని కోపానికి అచ్చిండ్లు.
అంతట్లకే ఆపసోపాలు వడుకుంట నక్క కచ్చీర్లకు అచ్చింది. కోపం మీదున్న పంజులు.. “పెద్దమనిషి తీర్గ ఉన్న నువ్వే గిట్ల ఆల్శంగత్తె ఎట్ల?” అని రుయ్యరుయ్యలాడిండ్లు. దానికి నక్క.. మాఫ్జెయ్యిమని అడిగి, “నేను తెల్లారంగనే బైలెల్లిన. తొవ్వల శెరువుకు అగ్గంటుకుంది. శెరువులున్న శాపలన్ని పాపం శెట్టెక్కినయి. శాపలకు తానం జేపిచ్చి, నీళ్లు తాపిచ్చి అచ్చేటాల్లకు గీ యాల్లయ్యింది” అని జెప్పింది. అసలుకే కోపం మీదున్నరాయె.. నక్క జెప్పిన ముచ్చట ఇనంగనే.. “ఎక్కన్నన్న శెరువుకు అగ్గంటుకుంటదా?.. శాపలు శెట్లెక్కుతయా?.. మేం అవులెగాల్లలెక్క గనిపిత్తున్నమా?’’ అని గయ్యిమని లేశిండ్లు. దానికి నక్క.. “గుర్రం శెట్టుకు వుట్టంగ లేంది.. శాపలు శెట్లెక్కయా?” అని అడిగింది. నక్క తెలివికి సప్పట్లు గొట్టిన పంజులు.. ఆసామి గుర్రాన్ని ఆసామికి ఇయ్యాల్నని, కావాల్నని మోసం జేశినందుకు నూరు రూపాయలు జుల్మానా గట్టాల్నని ఫర్మానా ఇచ్చిండ్లు.
… పత్తిపాక మోహన్
మొగని అమాయకత్వం జూసి మోసం చేద్దామని జూసినోళ్లకు ఇకమాతులతో బుద్దిచెప్పిన పెండ్లం
Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్
Children Stories | కొత్తగా దొంగతనానికి వెళ్లి పంచె పోగొట్టుకున్న డేడ్ దిమాక్ దొంగోడు
Children stories | ఇకమతులోడి దగ్గర పైసలు కొట్టేయబోయి ఈపు సాపు చేసుకున్న దొంగోడు