Virosh | టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వేడుకల సందడి అధికారికంగా ముగిసింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకతో తమ వివాహ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు జంట ప్రకటించింది. మార్చి 4 రాత్రి జరిగిన ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులు కేటీఆర్, కిషన్ రెడ్డి తదితరులు విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిసెప్షన్ చివర్లో అతిథులను ఉద్దేశించి మాట్లాడిన విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. “అందరికీ థ్యాంక్స్… మీ ప్రేమకు ధన్యవాదాలు. ఈ రోజు మేం సెలబ్రేషన్స్ ముగించాం. ఇక ఎలాంటి సందడి లేకుండా అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోతాం” అని విజయ్ అన్నాడు. ఆయన పక్కనే నిలబడ్డ రష్మిక క్యూట్‌గా నవ్వుతూ కనిపించింది. ఈ క్యూట్ మోమెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఐటీసీ మెమెంటోస్ ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీను తమ వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. తిరిగి హైదరాబాద్ చేరుకున్న తర్వాత విజయ్ స్వగ్రామానికి వెళ్లిన ఈ జంట అక్కడ నూతన గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించింది.
స్వగ్రామంలోని ప్రజలకు విజయ్ విందు భోజనం ఏర్పాటు చేయడం విశేషం. అనంతరం హైదరాబాద్‌లో అభిమానుల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో విజయ్–రష్మిక కలిసి పాల్గొని అభిమానులతో సంభాషించారు. మీడియా మీట్ కూడా నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. చివరగా మార్చి 4న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌తో ఈ పెళ్లి వేడుకలు ముగిశాయి. ఇప్పుడు ఈ జంట హనీమూన్‌కు వెళ్లబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒకసారి మాల్దీవులు వెళ్లిన ఈ జంట, భార్యాభర్తలుగా మళ్లీ అదే గమ్యాన్ని ఎంచుకుంటారా? లేక కొత్త డెస్టినేషన్ ప్లాన్ చేస్తున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి విరోష్ పెళ్లి వేడుకలు నేషనల్ వైడ్‌గా చర్చనీయాంశమై, అభిమానులకు మధుర జ్ఞాపకాలను అందించాయి.