ఖైరతాబాద్, ఆగస్టు 12 : జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రజాస్వామికవాదులపై పెట్టిన అక్రమ ఉపా కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టు ఉద్యమానికి సహకరించారనే ఆరోపణలతో వందలాది సాధారణ కార్యకర్తలు ఏండ్ల తరబడి విచారణ ఖైదీలుగా జైళ్లలో కాలం వెళ్లదీస్తున్నారని వాపోయారు. తక్షణమే వారిని విడుదల చేయడంతోపాటు అక్రమ ఉపా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న ఇందిపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నామని, ప్రజలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.