హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 12 (నమస్తే తెలంగాణ): దేవాదాయశాఖలో మతపరమైన ఉద్యోగాల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘అర్చక పోస్టుల్లో అక్రమ దందా’ కథనంపై ఆ శాఖలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిని నాగర్‌కర్నూల్ జిల్లాలోని శివాలయంలో అర్చక పోస్టుకు ఎంపిక చేయడంలో దేవాదాయశాఖలో కొందరు అధికారుల హస్తం ఉన్నట్టు చెప్తున్నారు. ఈ ఒక్క పోస్టే కాదు.. సగానికి పైగా లోపాయికారీ ఒప్పందాలతో జరిగినవేనని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తేనే పారదర్శకంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
దేవాలయంలో ఉన్న ప్రతిఒక్కరికీ ఎంపికైన అభ్యర్థి ఆంధ్రా ప్రాంతవాసి అని తెలుసని, గత మూడేండ్లుగా ముఖ్యఅర్చకుడి ఇంట్లో ఉంటూ, ఆయనతో ఉన్న సంబంధంతో ఇప్పుడు ఎంపికయ్యారంటూ ఆలయంలో చర్చ జరుగుతున్నది. ఎంపికైన అభ్యర్థి నంద్యాలలోని బనగానపల్లెకు చెందిన వ్యక్తి అని, తర్వాత తన అడ్రస్‌ను అచ్చంపేటకు మార్చుకున్నట్టుగా పలు ఆధారాలను కొందరు అభ్యర్థులు దేవాదాయశాఖకు ఇచ్చారు. అయినా లోపాయికారీ ఒప్పందాల నేపథ్యంలో ఈ పోస్టుకు అతనినే ఎంపిక చేస్తూ ఆర్జేసీ కార్యాలయం నుంచి దేవాలయ ఈవోకు ఫోన్ రావడంతో అతను ఎంపికైనట్టుగా ప్రకటించి రవీంద్రభారతికి తీసుకెళ్లారు. స్థానికత విషయం బయటపడడంతో ఏదైనా గొడవ అవుతుందేమోనని ప్రస్తుతానికి అతని నియామకాన్ని నిలిపివేసినట్టు సమాచారం.
ఖర్చులుంటాయి.. తప్పదు మరీ..
‘నమస్తే కథనం’లో ప్రస్తావించిన నియామకాల్లో అక్రమాలంటూ చెప్పినవన్నీ వాస్తవమేనంటూ కొందరు దేవాదాయ అధికారులు చెప్పారు. ఒక ముఖ్యఅధికారి మాట్లాడుతూ.. “మా శాఖ ఖర్చులెవరు భరించాలి. మొన్నటికి మొన్న ఈ పోస్టులకు సంబంధించి రవీంద్రభారతిలో ప్రోగ్రామ్ చేశారు. ఆ కార్యక్రమానికి ఎవరు ఖర్చు పెట్టారు.. ఒక దేవాలయం భోజనాలు పెడితే.. మరొకరు డెకరేషన్ చూసుకున్నారు. ఇంకొకరు ఇతర ఖర్చులు చూసుకున్నారు. ఇవన్నీ ఆలయ నిధులనుంచి ఎట్లా వాడుతాం. మళ్లీ మా జేబుల నుంచే ఇవ్వాలి కదా.. అయినా పోస్టులే కాదు. ఇంకా చాలా ఉంటాయి” అని ఒక ఈవో అన్నట్టు కొందరు ఉద్యోగులు చెప్పారు. అంతదాకా ఎందుకు.. ప్రధానకార్యాలయంలో వాడే కంప్యూటర్లు, ప్రింటర్లు అన్నీ ఎక్కడి నుంచి తెచ్చారో ఎంక్వైరీ చేయమనండి, అన్నీ బయటకు వస్తాయంటూ మరొక అధికారి వ్యాఖ్యానించారు.