హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరోసారి అప్పు తీసుకొనేందుకు సిద్ధమైంది. ఈ నెల 7వ తేదీన నిర్వహించే బహిరంగ ఈ-వేలంలో సెక్యూరిటీ బాండ్లు పెట్టి రూ.2,500 కోట్ల రుణ సమీకరణ చేస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ తమకు ప్రతిపాదన పంపినట్టు భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. 20 ఏండ్ల కాల పరిమితితో రూ.1,000 కోట్లు, 26 ఏండ్ల కాల పరిమితితో మరో రూ.1,500 కోట్లు తీసుకుంటామని తెలిపిందని ఆర్బీఐ వెల్లడించింది.
2026-27 ఆర్థిక సంవ త్సరానికి రాష్ట్ర వార్షిక రుణ లక్ష్యం రూ.58,458.71 కోట్లు కాగా, సెప్టెంబర్ 15వ తేదీ నాటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన నికర అప్పు రూ.46,400 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం సగం పూర్తికాకముందే మొత్తం వార్షిక రుణ పరిమితిలో సుమారు 80% ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ వినియోగించింది. తొలి త్రైమాసికం (క్యూ-1 ఏప్రిల్, మే, జూన్)లో రూ.18,900 కోట్లు, రెండో త్రైమాసికం (క్యూ-2 జూలై, ఆగస్టు, సెప్టెంబర్)లో రూ.27,500 కోట్ల రుణ సమీకరణ చేశారు. ఏడాది పూర్తికాకముందే రుణ సమీకరణ వేగం పెరుగడంతో కాంగ్రెస్ సర్కార్ ఆర్థిక నిర్వహణపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.