కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఓ విధానం, సొంత పార్టీ పాలిత రాష్ట్రంలో మరొక విధానం అవలంబిస్తుందా? మీ పార్టీకి రెండు ఆర్థిక విధానాలు ఉన్నాయా? ప్రతిపక్షంలో ఒకతీరు? అధికారంలో ఉన్నచోటా మరొకటా? టీజీ ట్రాన్స్‌కో ప్రైవేటీకరణపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మౌనం వహిస్తే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని తెలంగాణ ప్రజలకు తెలిసిపోతుంది.
-హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తేతెలంగాణ): ‘తెలంగాణలోని టీజీ ట్రాన్స్‌కో, జెన్కో, సింగరేణి, విద్యుత్తు డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోండి. వెంటనే జోక్యం చేసుకొని రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలను కాపాడండి’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు.ఈ మేరకు శుక్రవారం ఆయన రాహుల్‌గాంధీకి బహిరంగలేఖ రాశారు.
కాంగ్రెస్ జాతీయ విధానం ఢిల్లీలో ఒక విధంగా, తెలంగాణలో మరో విధంగా ఉంటుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో, రాయ్‌పూర్ ఆర్థిక తీర్మానాలను తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుందా? లేదా? అన్న విషయాలను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్మించిన ప్రజా ఆస్తులను ప్రైవేటీకరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదిత టీజీ-ట్రాన్స్‌కో 26 శాతం ఈక్విటీని బలహీనపర్చడం, ఐపీవో (వాటా తగ్గింపు) నిర్ణయం ప్రభుత్వ విద్యుత్తు సంస్థల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది రాష్ట్రంలోని వ్యూహాత్మక విద్యుత్తు, మౌలిక వసతుల భవిష్యత్తు, యాజమాన్యం, నియంత్రణకు సంబంధించిన కీలక అంశమని పేర్కొన్నారు.
‘టీజీ-ట్రాన్స్‌కో ఒక సాధారణ వాణిజ్య సంస్థ కాదు.. తెలంగాణ విద్యుత్తు రంగానికి వెన్నెముకగా నిలిచిన కీలక ప్రజా సంస్థ’ అని హరీశ్‌రావు అభివర్ణించారు. ట్రాన్స్‌కో పరిధిలో 29,400 కేవీ సబ్స్టేషన్లు, 1,07,220 కేవీ సబ్స్టేషన్లు, 3,37,032 కేవీ సబ్స్టేషన్లు, 31, 420కి పైగా సర్యూట్ కిలోమీటర్ల ఈహెచ్‌టీ లైన్లు, 1,184 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 43,848 ఎంఏవీ ట్రాన్స్ఫర్మేషన్ సామర్థ్యం కలిగి ఉన్నదని వివరించారు.
26 శాతం వాటా తగ్గింపు మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో మిగిలిన వాటాను కూడా ప్రైవేట్‌కు అప్పగించేందుకు మార్గాన్ని సుగమం చేస్తున్నారని ఆరోపించారు. టీజీ-ట్రాన్స్‌కో తర్వాత టీజీ-జెన్కో, సింగరేణి, డిసమ్లు కూడా ఇదే బాట పట్టనున్నాయా? అన్న విషయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని ఢిల్లీలో గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్.. తెలంగాణలో మౌనం వహించడంలోని ఆంతర్యమేందని ప్రశ్నించారు.
రాయ్‌పూర్ కాంగ్రెస్ ప్లీనరీ-2023 ఆర్థిక తీర్మానంలో పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రైవేట్ మోనోపాలీలు, డ్యూపాలీలు ఏర్పడకూడదని స్పష్టంచేసిందని హరీశ్‌రావు తన లేఖలో గుర్తుచేశారు. తెలంగాణలో టీజీ-ట్రాన్స్‌కోలో ఈక్విటీ డైల్యూషన్ ఏ కాంగ్రెస్ విధానం ప్రకారం చేస్తున్నారు? సీడబ్ల్యూసీ తీర్మానాలు ఢిల్లీకే పరిమితమా? తెలంగాణలో వర్తించవా? అని సూటిగా ప్రశ్నించారు.
‘మీరు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజల ఆస్తుల మానిటైజేషన్ విధానాలను పదే పదే ప్రశ్నించారు. ఎల్ఐసీ, విద్యుత్తు లాంటి ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా తగ్గింపుపై ఆందోళనలకు దిగారు. యూపీతోపాటు కాంగ్రెసేతర పాలిత రాష్ర్టాల్లోనూ కరెంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించారు’ అని రాహుల్‌కు రాసిన లేఖలో గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలోనూ దాన్ని ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు.
టీజీ-ట్రాన్స్ కోలో 26 శాతం వాటా ఎందుకు తగ్గిస్తున్నారు? టీజీ-జెన్కోను ఏం చేయబోతున్నారు? సింగరేణిపై ఉన్న ప్రతిపాదనలేంది? డిస్కమ్‌ల భవిష్యత్తు యాజమాన్యంపై ఆలోచన ఏంది?.. అని తెలంగాణ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను వారి అనుమతి లేకుండా ప్రైవేట్‌కు కట్టబెట్టొద్దని, ప్రభుత్వ ఆస్తులపై ప్రభావితం చేసే ఈ నిర్ణయాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ సర్కార్ ప్రతిపాదనలు కాంగ్రెస్ 2019 మ్యానిఫెస్టో, 2023 రాయ్‌పూర్ ఆర్థిక తీర్మానాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో? కాంగ్రెస్ జాతీయ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విధానం మారితే బహిరంగంగా ప్రకటించాలని, విధానం మారకపోతే రేవంత్ ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరారు. రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వెంటనే జోక్యం చేసుకుని టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను అడ్డుకోవాలని హితవు పలికారు.కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్న విషయాలను గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.