ముంబై: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను దొడ్డిదారిన జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)గా మార్చి పౌరసత్వ పరీక్షగా మార్చాలని చూస్తున్నదని ఆరోపించారు. శుక్రవారం ఛత్రపతి శంభాజీ నగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ మొదటి నుంచి ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు.
సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడతారని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేయడానికి ఇదే ప్రక్రియను ప్రాతిపదికగా ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ ప్రక్రియను తేలికగా తీసుకోకూడదన్నారు. చిన్న పాటి నిర్లక్ష్యం జరిగినా ఓటు హక్కుతో పాటు పౌరసత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఒవైసీ హెచ్చరించారు. తాము మొదటి నుంచి ‘సర్’ ప్రక్రియను, కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక విధానాన్ని కూడా వ్యతిరేకించామన్నారు.