Children Stories | ఒక రాజ్యానికి రాజు, మంత్రి ఉండెటోల్లు. ఇద్దరు మంచోల్లే! కాకుంటే.. మంత్రే జర ఆశపోతు. పైస అత్తందంటే.. పానం బోయినా వాయె గానీ పైస గావాలనెటోడు. ఆల్ల రాజ్యంలనే ఒక బిచ్చపాయినె ఉంటుండే. చిన్నప్పుడే ఆని అవ్వ – అయ్య సచ్చిపేయిండ్లు. ఎన్క ముంగట ఎవ్వలు లేకపోయెటాళ్లకు.. ఆల్లనీళ్లను అడుక్కుంట బతుకుతుండె. పొద్దుగాల లేవంగనే.. ఇల్లిల్లు తిరుక్కుంట, గంట గొట్టుకుంట అడుక్కుంటుండె. ఇక ఆ రాజ్యానికి రాజు.. కవులు, పండితులు, ఆల్లు ఈల్లు ఎవ్వల్లచ్చినా.. ఉత్తి చేతులతోని వంపెటోడు గాదు. గీ ముచ్చట ఎరుకైన ఆ బిచ్చపాయినె ఎట్లనన్న రాజుతానికి వోయి దానం బట్టాలెనని అనుకున్నడు. పొద్దుగాలనే రాజు తానికి వోయి, గనగన గంట గొట్టిండు. “దానం బట్టనీకి ఎవలో అచ్చిండ్లు. ఆల్లను తోల్క రా!” అంట సిపాయికి జెప్పిండు రాజు. ఆన్ని రాజు తానికి దోల్కవోయిండు సిపాయి. అయితే.. బిచ్చపాయినెకు ఓ ఊతపదముంది. ఎవ్వలు దానం జేసినా.. ‘ఎవ్వల కర్మ ఆల్లదే’ అంటడు. రాజు తానగూడ గట్లనే అంట చెయ్యి జాపిండు.
రాజుకు ఆని మాటలు కొత్తగ గొట్టినయి. బటులకు జెప్పి ఆనికి బొచ్చెనిండ పైసలిప్పిచ్చిండు. ఇదంత జూత్తున్న మంత్రికి ఎట్లనో అనిపిచ్చింది. ‘ఉత్తి పుణ్యానికి బొచ్చెడు పైసలు దొబ్బుక వోయిండు! ఎట్లనన్న ఆయిన్ని పొతం బెట్టాలె!’ అనుకున్నడు. ఆన్ని దగ్గరికి విల్సుకొని.. “రేపు మల్ల రా!” అంట జెప్పిండు. తెల్లారిగూడ రాజు తానికి అచ్చిండు బిచ్చెపాయినె. ఆడు అచ్చేది దూరంకెల్లి జూశిన మంత్రి.. ఆన్ని దగ్గరికి విల్సుకున్నడు. “అరేయ్! నీ నోట్లెకెల్లి కంపు ఆసనత్తందట. నువ్వు రాజుగారి మొకం సూసుకుంట మాట్లాడకు” అంట జెప్పిండు. రాజు తానికి వేయినంక, ఈడు రాజు ఈపుకెల్లి మొకం బెట్టి.. ‘ఎవ్వల కర్మ ఆల్లదే’ అంట మొదలువెట్టిండు. ఎన్కకు తిర్గి మాట్టాడుట్ల రాజుకు కోపం నశాలానికి అంటింది. గదే ముచ్చట మంత్రితోని అన్నడు. మోక ఎప్పుడు దొర్కుతదా అని సూత్తున్న మంత్రి.. “అయ్యా! మీ నొట్లెకెల్లి కంపు ఆసనత్తందట. గందుకే ఈపు దిక్కు దిర్గి మాట్లాడుతుండు” అంట జెప్పిండు. ఆ మాటినంగనే ఆని మీద రాజుకు మస్తు కోపమచ్చింది. పాపమంట దానంజేత్తె.. పతీజంత తీశిండని, ఆనికి బుద్ధి జెప్పాల్నని అనుకున్నడు. ఆన్ని విలిశి.. ‘ఈ కాయిదం దెచ్చినోల్ల ముక్కు, శెవులు కోయిండ్రి’ అంట రాశి, మడ్తవెట్టి ఆనికి ఇచ్చిండు. “దీన్ని దీస్కవోయి తలారికియ్యి. నూరు ఎండి రూపాలిత్తడు” అంట జెప్పిండు రాజు.
ఇగ ‘ఎప్పుడా !?’ అని కాసుగ్గూసున్న మంత్రి.. ఆడు అవుతలికి రాంగనే ఆని తానికెల్లి కాయితం గుంజుకున్నడు. “చల్!” అంట ఆన్ని అవుతలికి ఎల్లగొట్టిండు. శేతులకచ్చిన కొత్తలు ఎటుగాకుంట వాయెనన్న బాధతోని.. ‘ఎవ్వల కర్మ ఆల్లదే’ అనుకుంట వేయిండు ఆ బిచ్చపాయినె. మన మంత్రి.. ఎంటనే కాయితం దీస్కోని తలారి తానికి వోయిండు. ఆ తలారాయినె కొత్తోడు. ఆ దినాన్నె కొలవుల జేరిండు.. ఆనికి మంత్రి ఎవలో దెల్వది. మంత్రి ఇచ్చిన కాయితం సదివి.. ఎంటనే ముక్కు, శెవులు గోసి శేతుల వెట్టిండు. లబోదిబో అనుకుంట మంత్రి నెత్తీనోరు గొట్టుకుంట మొత్తుకున్నడు. ఎప్పటి తీర్గనే తెల్లారి అడుక్కునేందుకు రాజు తానికి వోయిన బిచ్చపాయినె ముక్కు, శెవులు మంచిగుండె వరకు రాజు పరేశానైండు. అంతట్లకే ముక్కు, శెవులకు పట్టీలు గట్టుకొని అచ్చిన మంత్రిని సూడంగనె.. ముచ్చటంత అర్తమైంది. ‘ఎవ్వల కర్మ ఆల్లదే’ అనుకుంట బిచ్చపాయినె రాజు ముంగట శెయ్యి జాపిండు. కతంత ఎరుకైన రాజు పకపక నవ్విండు.
… పత్తిపాక మోహన్
Children Stories | ఆపతికి.. సంపతికి పదిమంది ఉండాలె అనేందుకు ఈ కథే ఉదాహరణ
Children Stories | ఇకమతుల నక్క భూదేవి దగ్గరే అప్పు తీసుకొని.. కన్ను పోగొట్టుకుంది
Children Stories | చెట్టుకు గుర్రం పుడితే.. చేపలు చెట్టెక్కినయ్
మొగని అమాయకత్వం జూసి మోసం చేద్దామని జూసినోళ్లకు ఇకమాతులతో బుద్దిచెప్పిన పెండ్లం
Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్