Children Stories | ఇగో.. పొలగాండ్లు! ఇన్నారుల్లా.. ఈ కత మీకు ఎరుకున్నదే గని మన బాసల మల్ల శెపుతున్న.. గంతేనుల్ల.ఎన్కట ఒక దేశంల ఒక రాజు.. ఆయినెకో మంత్రి ఉంటుండె. రాజు అన్ని ముచ్చట్లల్ల మంత్రి ఇకమతులు జెప్పుడు, తొవ్వ జూపిచ్చుడు జేత్తుండె. అయితె మంచైనా.. శెడ్డగైనా గానీ ‘అంత మంచికే’ అనుడు మంత్రికి అలవాటు. రాజుకు ఒక్కోపారి మాలెస్క కోపమత్తుండె గని.. మంత్రి పెద్దోడాయె! రాజ్యం మంచి గోరెటోడాయె.. గందుకె, శాలాసార్లు కోపం ముక్కు కాడికి అచ్చినా, పోనీ తియ్యని ఊకుంటుండె.
ఒకపారి రాజు మావిడికాయ కోసుకోని తింటుంటె.. ఏలు తెగింది. సర్రున రత్తం వోయింది. రాజాయె.. అందరూ ‘అయ్యో.. అయ్యో’ అనుకుంట తాయిమాయి జేశిండ్లు. మన మంత్రి ఎప్పట్లెక్కనే.. “అయితెమాయె తియ్యి! అంత మంచికే” అంట అన్నడు. ఆయినె మాటలినంగనె రాజుకు శిర్రుకచ్చింది. రయ్యిమనిలేశి.. “మంత్రిని జైళ్ల ఎయ్యుండ్లి” అంట ఆడరేశిండు. ఎవ్వలెంత జెప్పినా యాతాప ఇననన్న ఇనలే. మన రాజుకు షికారు వోవుడంటె మస్తు ఇష్టం. ఎప్పటికీ మంత్రితోనే వోతుండె. ఎప్పటిలెక్కనే ఆ అయితారం కొందరిని దోల్కొని షికారుకు వేయిండు. అడివిలకు వోయి అటీటు దిరిగిండ్లు. ఒక్క జీవమన్న ఎదురుగాలె. రాజు ఇంక.. ఇంక లోపల్లోపలికి వోయిండు. అందరు కొత్తోల్లాయె.. మంత్రిలేక పోవుట్ల రాజును జంగల్ లోపలికి పోవద్దని జెప్పుడు ఆల్లతోని గాలె. అట్ల వొయ్యి వొయ్యి జంగల్ నడిమిట్లకు జేరిండ్లు. సుట్టు శిమ్మని శీకటి.. అంతట్లకె ఎక్కడికెల్లో గుంపు అచ్చి వడ్డది. ఆల్లను జూడంగనె ఎక్కడోల్లక్కనే పరారైండ్లు. ఏమైతందో తెల్వకముందే.. ఆల్లు రాజును దొరకవట్టిండ్లు.
ఆరోజు ఆ ఆడివి మనుసుల పెద్ద పండుగ. ఆల్ల దేవతకు ఎవ్వల్నన్న బలి ఇచ్చెతందుకు లెంకులాడవట్టిండ్లు.. అంతట్లకె ఆల్లకు రాజు దొరికిండు. తీస్కపోయి రాజును మంచిగ తయారు జేశి, దేవతతానికి తోల్కపోయిండ్లు. రాజు తలికాయ నరికెతందుకు ఆల్ల పెబ్బ కత్తి లేవట్టిండు. బయంతోని రాజు శేయి అడ్డం వెట్టిండు. రాజు శెయ్యికి పట్టి గట్టింది జూశి.. ఎంటనే బలి ఆపేశిండ్లు. అన్ని సక్కగుంటెనే బలియ్యాలె. లేకుంటే దేవుత ఒప్పుకోదని.. శెయ్యి దెగి పట్టి గట్టుకున్నందుకుకు వనికిరాడని రాజును ఇడిశివెట్టిండ్లు. ‘బతుకు జీవుడా!’ అనుకుంట ఎట్లనో తండ్లాకుంట, దేవులాడుకుంట రాజ్జానికి అచ్చిండు రాజు. అచ్చుడుతోనే జైలకు వోయి.. మంత్రిని వట్టుకొని గట్టిగ అలుముకున్నడు.
“అవు.. నువద్దే! ఏజ్జరిగినా అంతా మన మంచికే!” అంట కత మొత్తం జెప్పి.. “మరి అంతా మంచికే అంటవుగదా! మరి జైల్ల నువ్వేం జేశినవు. నీకేం మంచి అయింది” అంట అడిగిండు. దానికి మంత్రి.. “మంచే ఆయే! నన్ను జైళ్ల ఎయ్యకుంటె నేను గూడ షికారు కద్దును. నా కాళ్లు జేతులు అన్ని సక్కగున్నయి గన్క.. నన్నే బలిద్దురు. ఇది మంచిగాదా” అంట అనేసరికి.. రాజు “సెబాస్!” అంట మల్ల అలుముకున్నడు.
… పత్తిపాక మోహన్
Children Stroies | తెనాలి రామలింగడి దగ్గరే డబ్బులు కొట్టేయాలని జూసి బొక్కబోర్లవడ్డ దొంగోడు
Children Stories | ఆపతికి.. సంపతికి పదిమంది ఉండాలె అనేందుకు ఈ కథే ఉదాహరణ
Children Stories | ఇకమతుల నక్క భూదేవి దగ్గరే అప్పు తీసుకొని.. కన్ను పోగొట్టుకుంది
Children Stories | చెట్టుకు గుర్రం పుడితే.. చేపలు చెట్టెక్కినయ్