బుధవారం 08 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 16, 2020 , 00:23:06

మామిడి పంటకు ‘ మద్దతు ’

మామిడి పంటకు ‘ మద్దతు ’
  • మండలాల్లో ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు
  • అవగాహన కల్పిస్తున్న ఉద్యానవన అధికారులు
  • హర్షం వ్యక్తం చేస్తున్న మామిడి రైతులు
  • తెలంగాణ సర్కార్‌ మరింత ప్రోత్సాహం

షాద్‌నగర్‌రూరల్‌ : అన్నదాతల సంక్షేమానికి తెలంగాణ సర్కార్‌ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ప్రతి రైతును శ్రీమంతుడిగా మార్చేందుకు ప్రణాళికతో ముందుడుగు వేస్తున్నది. చిన్న, సన్నకారు రైతులతో పాటు ప్రతి రైతు లాభాల బాటలో పయనించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైతుల అభ్యున్నతికి  రైతు బంధు, రైతుబీమా పథకాలను అమలు చేయడంతో పాటు ఏ పంటలను పండించాలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి వివరిస్తున్నది. రైతు పండించిన ప్రతి పంటకు మద్దతు ధరను చెల్లించేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మామిడి రైతులకు సర్కార్‌ మరింత ప్రోత్సాహం.. 

రాష్ట్రంలో పండించిన మామిడి పండ్లకు ఇతర రాష్ర్టాల్లో భారీగా డిమాండ్‌ ఉంది. మామిడి రైతులను మరింత ప్రోత్సాహించడంతో పాటు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మామిడి రైతులకు రాయతీతో పాటు మద్దతు ధరను చెల్లించేలా ప్రభుత్వం ప్రణాళికను రూపకల్పన చేసింది. మామిడి, పసుపు, మిరప రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ప్రతి మండలంలో ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యత్వం తీసుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీడీఏ (అగ్రికల్చర్‌ ప్రాసెస్డ్‌, ఫుడ్‌ప్రాడెక్ట్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ) ద్వారా నేరుగా రైతులు పండించిన మామిడి పండ్లకు మద్దతు ధరను చెల్లించేలా ప్రణాళికలను రూపొందించింది. ఏపీడీఏలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న రైతులకు మామిడి తోటలను ఏ విధంగా పెంచాలో, ఎక్కువ దిగుబడిని, ఏ-1 మామిడి పండ్లను ఎలా పండించాలో వంటి అంశాలతో పాటు చేతికొచ్చిన పండ్లను ఏ విధంగా కత్తెరించాలో అవగాహన కల్పిస్తారు. రైతులకు అవగాహన కల్పించడంతో పాటు తగు సలహాలు, సూచనలు చేస్తూ రైతులు పండించిన పంటను ఇతర రాష్ర్టాలతో పాటు విదేశాలకు ఎగుమతి అయ్యేలా ఏపీడీఏ కృషి చేస్తుంది. 

జిల్లా, మండలంలో ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు

జిల్లాలో మామిడి రైతులను మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కార్‌ పక్క ప్రణాళికతో ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం 2014 మంది రైతులు 24,066 ఎకరాలలో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలంలో మొత్తం 47 గ్రామ పంచాయతీలకు గాను 545 మంది రైతులు 1459 ఎకరాలలో మామిడి పంటను సాగు చేస్తున్నారు. మామిడి రైతులు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యత్వం తీసుకునేలా ఉద్యానవనశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో 7 ఉత్పత్తిదారుల సంఘాలకు గాను షాద్‌నగర్‌ నియోజకవర్గానికి మూడు సంఘాల ఏర్పాటు చేశారు. ఇప్పటికే సుమారు 200 మందికి పైగా మామిడి రైతులు సభ్యత్వాలను తీసుకున్నారు. ఈ సంఘంలో 10 మంది నుంచి ఎంత మందినైనా చేర్చుకుంటారు. ఉత్పత్తిదారుల సంఘంతో పాటు ఏపీడీఏలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యత్వం తీసుకున్న రైతులకు ప్రభుత్వం ప్రోత్సహం ఉంటుంది. దీనిపై గ్రామాల్లో ఇప్పటికే అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.  ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యత్వం తీసుకున్న రైతులకు మామిడి సాగుపై ప్రత్యేక అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడంతో మామిడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండించిన మామిడి పండ్లకు ఏపీడీఏ సంస్థ మద్దతు ధర చెల్లిస్తుండడంతో ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

చాలా సంతోషంగా ఉంది 

రైతులు విక్రయించే మామిడి పండ్లకు ప్రభుత్వమే ప్రత్యేక ధరను నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దళారుల చేతుల్లో మామిడి రైతులు మోసపోకుండా ఉంటారు. ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యత్వం తీసుకున్నా. 

    - బాల్‌రెడ్డి, ఆగిర్యాల గ్రామం, కొందుర్గు 

మంచి సలహాలు ఇస్తున్నారు

మామిడి సాగుకు గాను అధికారులు మంచి సలహాలు ఇచ్చారు. ఏ-1 మామిడి పండ్లను ఏ విధంగా పండించాలో, వాటిని ఏ విధంగా కోయాలో అవగాహన కల్పించారు. మామిడి రైతులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడం సంతోషంగా ఉంది. 

    -లింగారెడ్డి  పాపిరెడ్డిగూడ, కేశంపేట 

ఉత్పత్తిదారుల సంఘంలో రైతులు సభ్యత్వం తీసుకోవాలి

మామిడి రైతులు అధిక దిగుబడిని పొందేలా, దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు  ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. మండలంలోని ప్రతి గ్రామంలో ఉత్పత్తిదారుల సంఘంపై అవగాహన కల్పిస్తున్నాం. సభ్యత్వం తీసుకున్న రైతులకు మామిడి సాగుపై అవగాహన కల్పిస్తాం. పండించిన పంటను ఏపీడీఏ ద్వారా మద్దతు ధర చెల్లిస్తాం. ప్రతి రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యత్వం తీసుకోవాలి

           -చక్రపాణి  ఏడీహెచ్‌, జిల్లా ఉద్యానవన, పట్టు శాఖ అధికారిlogo