KCR | నా గుండెని చీలిస్తే కనిపించేది తెలంగాణేనని.. ప్రాణం ఉన్నంత వరకు.. భగవంతుడు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు గానీ.. ఎవరికైనా గానీ మోసం జరిగినా.. అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. భువనగిరిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వాగ్ధానాలు భంగం చేసి రైతాంగం నోట్లో మట్టికొట్టి.. నిరుద్యోగ యువకులకు మెగా డీఎస్సీ దగా చేసి మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి మిమ్మల్ని అందరీ కోరుతున్నా. ఇవాళ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంగ్రెస్‌కు పంచాది పడ్డది. తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడేది ఎవరు? ప్రజల తరఫున కొట్లాడేది ఎవరూ.. కేసీఆరేనా? అని అనగా.. జనం కేసీఆరేనని నినదించారు.
‘నేను ఒకటే మాట మనవి చేస్తున్నా. భగవంతుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించిండు. ఈ తెలంగాణ ఎట్టిపరిస్థితుల్లో సమైక్యవాదుల చేతుల నుంచి విముక్తి కావాలని.. నా ప్రాణంపెట్టినా ఫర్వాలేదని ఆనాడు బయలుదేరారు. ఆ నాడు ఎవరూ రాలేదు. యువకులు, విద్యార్థులు, మహిళలంతా కదిలితే బ్రహ్మాండమైన ఉప్పెన అయ్యింది. రాష్ట్రం తెచ్చుకున్నాం. పదేళ్లు మంచిగ చేసుకున్నాం. నీళ్లు తెచ్చుకున్నాం. కరెంటు బాగా చేసుకున్నాం. ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఉన్నంతలో అందరినీ కాపాడుకుంటున్నం. ఆ విధంగా ముందుపోయాం. మొన్న ఓ సుడిగాలి.. దుర్మార్గపు గాలి వచ్చింది. బీఆర్ఎస్ ఓడిపోయింది నాకు బాధలేదు. పార్టీ అంటే ఓడినా.. గెలిచినా ప్రజల్లో ఉండాలి.. ప్రజల కోసం పని చేయాలి. అదే పార్టీ. ఇవాళ తెలంగాణలో లక్షల మంది క్యాడర్ బీఆర్ఎస్కు ఉంది’ అని తెలిపారు.
‘నేను ఒక్కటే చెబుతున్నా. ఇవాళ రైతుల గుండెల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె చీలిస్తే కనిపించేది తెలంగాణ. నా ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు గానీ, ఎవరికైనా గానీ మోసం జరిగితే.. అన్యాయం జరిగితే నిద్రపోను. భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులుపడ్డంత పోరాటం చేస్తా. ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను బురిడీ కొట్టించింది. చల్లగా ముందుకుపోతున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచి.. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాలి. మీ అందరినీ కోరుతున్నా. కార్యకర్తలు, నాయకులు అందరూ క్యామ మల్లేశ్‌ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. ఈ రోజు చూపించిన ఉత్సాహాన్ని ఏడు నియోజకవర్గాల్లో మే 13వ తేదీ వరకు చూపించి.. కారుగుర్తుకు ఓటేసి క్యామ మల్లేశ్‌ను భారీ గెలిపించాలి. కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీతో ఉంటాడని.. మీ కోసమే ఉంటడని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ!’ ప్రసంగాన్ని ముగించారు.