KTR : కాంగ్రెస్ పార్టీ అంటేనే మాయగాళ్ల పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీపైన, వారి సర్కారుపైన విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో వెయ్యి మంది పేదల ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టిన ఘటనపై ఆయన మండిపడ్డారు. భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదలను బలవంతంగా గెంటేసిందని, గతంలో అదే భూదాన్ భూముల్లో కొంతభాగాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులపరం చేసిందని ఆరోపించారు.
కేటీఆర్ ఇంకా ఏమర్నారంటే.. ‘వాస్తవానికి వెలుగుమట్లలో ఇండ్లు కూలగొట్టిన ప్రాంతంలోని భూములు భూధాన్ భూములు. 1950ల్లో ఆచార్య వినోభాబావే నాయకత్వంలో జరిగిన భూదానోద్యమంలో పలువురు దాతలు భూములు దానం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం లక్ష ఎకరాల భూమిని దానం చేశారు. అదేవిధంగా వెలుగుమట్లలో కూడా ఇద్దరు దాతలు 62 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకు విరాళంగా ఇచ్చారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేవరకు కూడా ఆ భూమి భూదాన్ బోర్డు పేరుతోనే పట్టాతో ఉంది. దాదాపు 30 ఏళ్లకుపైగా భూదాన్ బోర్డు పేరు మీద ఉన్న ఆ భూములను నాడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదకు మార్చింది’ అని మండిపడ్డారు.
‘కాంగ్రెస్ అంటేనే మాయగాళ్లు. కాబట్టి భూమిని మాయం చేసిండ్రు. మిగిలిన భూమి అట్లనే ఉంది. ఆ భూమిని 2014 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ భూదాన్ బోర్డు 1,895 మందికి పట్టాలు చేసింది. ఆ భూమిలో గత పది పన్నెండు ఏళ్లలో దాదాపు 1000 మంది ఇళ్లు కట్టుకుని నివాసాలు ఉంటున్నరు. మధ్యలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ భూముల చుట్టుపక్కల ఆక్రమణలు జరుగుతున్నయని ఫిర్యాదులు వచ్చినయ్. అయినా తాము పరిశీలించాలని అధికారులకు చెప్పినం తప్ప ఎక్కడా పేదల ఇళ్లను కూల్చలేదు. కేసీఆర్ హయాంలో జీవో నెంబర్ 58 కింద తాము లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినం. ఒక్క హైదరాబాద్లోనే లక్షన్నర మందికి పట్టాలు అందజేసినం. ఖమ్మం పట్టణంలో కూడా 58 జీవో కింద తాము మూడు వేల మందికి పట్టాలు ఇచ్చినం. ఇదేవిధంగా ప్రతినగరంలో, ప్రతి మున్సిపాలిటీలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా తాము జీవో నెంబర్ 58 కింద పట్టాలు అందించినం’ అని కేటీఆర్ చెప్పారు.
‘ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు శత్రువులపై దాడి చేసినట్టు పేదల ఇండ్ల మీద దాడిచేసింది. మూడు వేల
మంది పోలీసులతో పోయి పేదల మెడలు పట్టి బయటికి గెంటేసి ఇళ్లు కూలగొట్టిండ్రు. ప్రజలంతా
చూసిండ్రు ఆ వీడియోను. ఒక అమ్మాయి అయితే మొత్తుకున్నది. 10 నిమిషాలు నా ఇల్లు చూసుకుంటా
అన్నా.. ఆ తర్వాత మీరు కూలగొట్టుండ్రి అని మొరపెట్టుకున్నది. అయినా అధికారులు కరుణించలేదు.
ఆఖరికి పిల్లలు వాళ్ల పుస్తకాలు, బ్యాగులు తీసుకుంటమంటే కూడా వినలేదు. మెడలు పట్టి నూకి
బయట పారేసిండ్రు’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.