Shiva Nirvana | మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ డివోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఇటీవల విడుదలైన టీజర్ మరియు పాటల్లో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించడంతో, ఈ కథ పూర్తిగా శబరిమల యాత్ర నేపథ్యంలో సాగుతుందని సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా ఈ రూమర్లపై దర్శకుడు స్పష్టతనిచ్చారు.
ఈ చిత్రానికి శబరిమలతో ఎలాంటి లింక్ లేదని దర్శకుడు శివ నిర్వాణ స్పష్టం చేశారు. సినిమాలో హీరో జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష కేవలం ఒక భాగం మాత్రమే అని ఆయన తెలిపారు. నిత్య జీవితంలో వ్యసనాలు ఉన్న ఒక వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో ఈ దీక్ష తీసుకోవాల్సి వస్తే.. ఆ తర్వాత అతడు మందు, ఇతర వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాల్సి వస్తుందని, అక్కడే కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుందని ఆయన వివరించారు. కథకు అత్యంత కఠినమైన నియమాలు అవసరం కాబట్టే తాను అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ 41 రోజుల దీక్షా కాలమే సినిమాకు స్క్రీన్ప్లే పరంగా ప్రధాన బలంగా మారుతుందని, దీక్షకు ముందు, ఆ సమయంలో జరిగే నాటకీయ పరిణామాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని శివ నిర్వాణ తెలిపారు. ఈ చిత్రం ఆగస్టు 21న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది.