హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్( Danam Nagendhar) , కడియం శ్రీహరి( Srihari ) కి స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తి ని అపహాస్యం చేసినట్టే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) అన్నారు. స్పీకర్ నిర్ణయం శాసన వ్యవస్థ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని విమర్శించారు.
ప్రజలు ఒక పార్టీ గుర్తుపై ఓటు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు తర్వాత అధికారంలో ఉన్న పార్టీలో పనిచేయడం ప్రజల తీర్పును తుంగలో తొక్కినట్టేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌కు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి, ప్రజల తీర్పును పూర్తిగా అవమానించినట్టేనని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
కడియం శ్రీహరి కూతురు కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. కడియం శ్రీహరి స్వయంగా కాంగ్రెస్ కండువా వేసుకుని తన కూతురు తరపున ఎన్నికల ప్రచారం చేయడమే కాకుండా, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీ చేసిన అభ్యర్థుల తరపున బహిరంగంగా ప్రచారం చేసిన విషయం ప్రజలు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు.
ఇలాంటి స్పష్టమైన పరిస్థితుల్లో కూడా వారికి స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం పార్టీ ఫిరాయింపు లను ప్రోత్సహించే చర్య మాత్రమే కాకుండా రాజ్యాంగ వ్యవస్థలను అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉపయోగిస్తున్నారనే వాదనకు బలం చేకూరుస్తుందని విమర్శించారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ఈ తీర్పు శాసన వ్యవస్థ చరిత్రలో ఒక చీకటి రోజుగా నిలుస్తుందని పేర్కొన్నారు.