మండల్ కమిషన్ అమలు జరపాలని ఎగిసిన ఉద్యమ పరిణామాల తర్వాత తిరిగి బీసీ చైతన్యం ఇప్పుడు తెలంగాణ అంతటా బలంగా వీస్తున్నది. ఇది ప్రతి బీసీ ఎదను తడుతున్నది. బీసీ కులాల నుంచి ఎగుస్తున్న చైతన్యం ఎటువైపునకు దారితీస్తుందోనని ఆలోచనాపరులు అంచనాలు వేస్తున్నారు. రాజకీయ పార్టీలు సహజంగానే బీసీ చైతన్యాన్ని తమ ఖాతాల్లోకి ఏ విధంగా వేసుకోవాలోనని ప్రయత్నిస్తాయి. బీసీలలో వస్తున్న చైతన్యం ఏ రూపంలో ఎటు దిక్కుగా మళ్లినా రాజకీయ పార్టీలకు తొట్రుపాటు కలిగిస్తుంది. ఈ రకమైన పరిణామాలు ఒకరకంగా బీసీలకు కలిసివచ్చే కాలమైనప్పటికీ రాజకీయ పార్టీలను మాత్రం సంకట పరిస్థితుల్లోకి నెడతాయి.
తెలంగాణలో రాజకీయ పార్టీల తీరుతెన్నులపై బీసీలకు సహజంగానే పలురకాల సంశయాలున్నాయి. దీనికి కారణాలనేకం. బీసీలంతా ఒక్కతాటిపైకి రాకుండా చేయటంలో అగ్రకుల ఆధిపత్యాలు తరతరాలుగా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తూ వస్తున్నారో తెలిసిందే. ఆ పరంపర కొనసాగింపుగానే రాజకీయ పార్టీలు అదే దారిలో ఇప్పటికీ నడుస్తున్నాయి. బీసీలు సమైక్యం కాకుండా చేయటంలో సఫలీకృతమవుతూ వస్తున్న రాజకీయ పార్టీలకు ఇటీవల బీసీల నుంచి వస్తున్న చైతన్యం కొంతవరకు గందరగోళానికి గురిచేస్తున్నది. బహిరంగంగా ఈ విషయంపై మాట్లాడటానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కానీ, బీసీ చైతన్యాన్ని ముక్కలు చేయటానికి, కులాలపరంగా వాళ్ల మధ్య విభజన రేఖలు గీయటానికి మాత్రం అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలు ఎన్ని పన్నాగాలైనా పన్నుతాయి. బీసీలను కులాలపరంగా విడదీసేందుకు నిచ్చెన మెట్ల కులవ్యవస్థ పాముపట్టాల ఆటలు ఉండనే ఉన్నవి.
బీసీలు గమ్యం చేరకుండా వారి మధ్య వైరుధ్యాలను సృష్టించేందుకు కొందరు చూస్తారు. అది సాధ్యం కాకపోతే బీసీ నాయకత్వాలను.. పార్టీలవారీగా విభజించి గీతలు గీస్తారు. ఫలానా పార్టీ బీసీలకు అనుకూలమని, ఫలానా పార్టీ వ్యతిరేక మని బీసీల ఐక్యతను దెబ్బతీసే పనులు చేస్తారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, కులగణన చేయాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ గొంతుకల నుంచి ప్రశ్నలు వస్తుంటే ఆధిపత్య వర్గాలు అనేక విచ్ఛిన్నకర వాదనలు ముందుకు తెస్తున్నాయి. ‘బీసీలంతా ఒక్కటికారు’ అన్న పాత విషప్రచారానికే కొత్త కోణంలో రంగులు వేసి ముందుకు తెస్తున్నాయి. బీసీ వాదమే లేదని కొందరు వాదనలు లేపుతున్నారు. బీసీ కులగణన చేస్తే దేశసమగ్రత దెబ్బతిని, దేశ సమైక్యత విచ్ఛిన్నమవుతుందని వాదనలు చేస్తున్నారు. చైతన్యంతో మాట్లాడే బీసీలను కాంగ్రెస్ బీసీ, బీఆర్ఎస్ బీసీ, బీజేపీ బీసీ, వామపక్ష బీసీలని రాజకీయ పార్టీల స్టాంపులు వేసి విభజించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీలో ఉన్న బీసీలను మరొక రాజకీయ పార్టీలోని బీసీలపైకి ఉసికొల్పినట్టుగానే.. చైతన్యంతో మాట్లాడే బీసీలపైకి బీసీలనే ఉసికొల్పి విభేదాలు సృష్టిస్తున్నారు.
ఆధిపత్య వర్గాలు తమ రాజకీయ పబ్బాలు గడుపుకొనేందుకు ఎస్సీలకు- ఎస్సీలకు మధ్య, బీసీలకు- బీసీలకు మధ్య, ఎస్టీలకు- ఎస్టీలకు మధ్య వైరుధ్యాలను సృష్టించటం రివాజుగా వస్తున్నది. కానీ, ఆధిపత్య వర్గాల ఉక్కుపాదాల అణచివేతలపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి నిలుస్తాయని, దాన్ని ఆపటం ఎవరి తరం కాదని ఈ నేలపై జరిగిన ఐక్యతా పోరాటాలే పాఠాలు చెప్తున్నాయి. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో అట్టడుగు కులాలు, వర్గాలన్నీ కలిసి పనిచేశాయి.
బీసీలంతా ఒక్కతాటిపైకి తప్పక వస్తారు. ‘మా వాటా మాకే’నంటూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడే సమయం ఆసన్నమైంది. తెలంగాణలోని అన్ని పార్టీల్లో 2 కోట్లమంది బీసీలు ఉన్నారు. బీసీలు లేకపోతే రాజకీయ పార్టీలు కుప్పకూలి కునారిల్లిపోతాయి. బీసీల దీర్ఘకాలిక హక్కుల సాధన కోసం అన్ని పార్టీల్లో ఉన్న బీసీలు ఒక దగ్గరకు జమకావాలి. స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు బీసీ రిజర్వేషన్లు సాధించుకునే వరకు, కులగణన జరిగేవరకు బీసీలు సామూహిక గొంతుకగా మారాలి. బీసీ చైతన్యాన్ని చెల్లాచెదురు చేయాలని చూసేవాళ్ల కుట్రల్ని భగ్నం చేయాలి. ‘బీసీలంతా సంఘటితమై జేఏసీగా ఏర్పడి ఒక్క గొంతుకగా గర్జిస్తున్నాం.. చూడండి’ అన్న ఐక్యతాపాఠం కూడా చరిత్రకందించాలి.
నాటి తెలంగాణ సాయుధ పోరాటానికి ముందుగా ఏర్పడ్డ ఆంధ్ర మహాసభల్లాగా, తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఏర్పడ్డ తెలంగాణ జేఏసీలాగా, బీసీలకు స్థానిక సంస్థల్లో సమ వాటా, చట్టసభల్లో రిజర్వేషన్లు, సమగ్ర బీసీ కులగణన కోసం ఊరికొక జేఏసీ రావాలి. కుల, విద్యార్థి, మేధావి, ఉపాధ్యాయులు, కార్మిక, కర్షకులు, ఉద్యోగులు అంతా కలిసి బీసీ జేఏసీగా ఏర్పడాలి. ‘మనం విడిపోతే చీలిపోతాం, కలిసుంటే గెలిచి తీరుతాం’ అన్న సోయి బీసీల్లో పెరిగింది. మన సీట్లు మనకొస్తేనే బాగుపడతాం. బీసీల ఐక్యతే దేశసమైక్యత. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం గళం విప్పుదాం. గర్జనలు చేద్దాం.