మాద్వి హిడ్మా.. ఇమ్మడి రవి.. ఇద్దరూ ఒకటి కాదు. భిన్న స్వభావాలు, విభిన్న కార్యాలు. ఒకరిది అలుపెరగని రక్త చరిత్రైతే.. ఇంకొకరిది అంతులేని పైరసీలో కీలక పాత్ర.చట్టపరంగా కరడుగట్టిన నేరస్తులు. రాష్ట్రంలో ఈ వారం వీళ్లదే. మెయిన్‌స్ట్రీమ్, సోషల్ మీడియా ట్రెండింగ్‌లో వీళ్లిద్దరే. రాజ్యం దృష్టిలో ఇద్దరూ మోస్ట్ వాంటెండ్ క్రిమినల్స్. కానీ, మానవీయ స్పందనలు మాత్రం వైరుధ్యాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. ఆషాడభూతి కార్పొరేట్ శక్తుల మీద కత్తిగట్టిన ఆశాదూతలని తలుస్తున్నాయి. వ్యవస్థీకృతమైన సామాజిక దౌర్జన్యాలు, ఆర్థిక దోపిడీ మీద యుద్ధం ప్రకటించిన అవధూతలని కొలుస్తున్నాయి. పెద్దలను కొట్టి పేదలకు పంచిన జానపద సాహిత్యంలో వీర నేరస్తుడు రాబిన్ హుడ్కు సరిజోడని మద్దతిస్తున్నాయి. చట్ట నియమాలకు, జనాభిప్రాయాలకు మధ్య ఎందుకీ విలోమం? న్యాయ సూత్రాలకు, నైతిక సూక్ష్మానికి మధ్య ఏమిటీ వైరుధ్యం?
సామూహిక మానవ అభిప్రాయాల మీమాంస అతి ఉత్కృష్టమైనది. చట్టబద్ధమైన నేరస్తులను హీరోలంటూ జనం నెత్తిన పెట్టుకున్నప్పుడు కొలవటానికి కొలమానాలు, విశ్లేషించటానికి ఉపమానాల నిసర్గకు అందుతుం దా? రంగులు పులిమిన స్వార్థం బహురూపాల్లో జన బాహుళ్యంలోకి చొరబడి రక్తమాంసాల స్పం దనను ఆర్థిక వనరులుగా మలిచి గ్లోబల్ మార్కెట్‌పరం చేసిన కార్పొరేట్ డిజాస్టరే చట్టబద్ధమైనప్పుడు సాధారణ జన గమనాన్ని ఎటు వైపుకని దిశానిర్దేశం చేయగలం? శక్తి వైకల్యతను సంతరించుకున్న పౌర సమాజపు సంవేదనలకు ఎలా తులాభారం వేయగలం? మానవీయ ఉద్వేగాలను సరితూచే మనో విజ్ఞాన సాధనాలు సృష్టిలో అసలు ఉన్నాయా? అంటే అప్పుడప్పుడు పొడచూపే కొన్ని సామాజిక సదృశ్యాలు మాత్రమే వీటి ని విశదీకరించగలవు. ఒక్క రోజులో వచ్చిన అభిప్రాయం అసలే కాదు. రాజద్రోహిగా ప్రకటించి ఆంధ్ర పోలీసులు కాల్చిచంపిన మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మాను ఆదివాసీ, బడుగు బలహీనులు దేవుడు అని కొలుస్తున్నారు. వెండితెర దొంగ అని తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవిని సాధారణ, మధ్యతరగతి జనులు హీరో అని పిలుస్తున్నారు.
2017 డిసెంబర్ మాసంలో అనుకుంటా హిడ్మాను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. చిక్కని చలికాలం. కొంతమంది జర్నలిస్టు మిత్రులం భద్రాచలంలోని వైఎస్సార్సీపీ నాయకురాలు దామెర్ల రేవతి ఇంట్లో రాత్రి భోజనం చేసి, తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొంటా ఫారెస్టు బ్లాక్ వరకు వెళ్లాం. వెల్పోచా అనే గ్రామం తర్వాత గమ్యస్థానం. అక్కడి నుంచి ఎక్కడికి పోవాలో అప్పటికి మాకు తెలియదు. అడవి మీద పొగమంచు పరుచుకున్నది. ఆ మబ్బుల్లో కలిసి అడవిలో సాగాలనేది మా ప్రయత్నం. అజ్ఞాత గిరిజన మిలీషియా మిలిటెంట్ కలిశాడు. 18 కిలోమీటర్ల కాలినడక అని చెప్పాడు. రెండు కిలోమీటర్లకు పైగా దూరం నడిచాక.. ఒక దారి చూపించాడు. ఎంత దూరం నడవాలో చెప్పాడు. కొండ గుర్తులు వివరించాడు. అక్కడికి చేరుకుంటే మాకు ఇంకో మిలిటెంట్ కలుస్తాడని చెప్పి అతను వెళ్లిపోయాడు. చిన్న చిన్న గ్రామాలను దాటుకుంటూ ఇంకో 5-6 కిలోమీటర్లు నడిచామో లేదో.. సీఆర్పీఎఫ్ పోలీసు బలగాలు ఎదురుపడ్డాయి. జర్నలిస్టులం అని చెప్పాం. మా గ్రూప్‌లో ఇద్దరు జాతీయ మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. వాళ్లే పోలీసులతో మాట్లాడారు. ఐడీ కార్డులు చూపించాం. ఆదివాసీ జీవన స్థితిగతుల అధ్యయనం కోసం వెళ్తున్నట్టు చెప్పాం.
తెలంగాణ జర్నలిస్టులంటేనే మావోయిస్టు సింపథైజర్లనే అనుమానం ఉన్నది. మమ్ముల్ని అడుగు కూడా ముందుకు వెయ్యనీయలేదు. ‘మమ్మల్ని తీసుకువెళ్లండి’ అని ఆర్డర్ వేశారు. జర్నలిస్టుమని చెప్పి తెలివి తక్కువ పని చేశామని అప్పుడు అర్థమైంది. నిరాశ, నిస్పృహ వెంటాడగా వెనుదిరిగాం. కానీ, అడవిలో సాగిన ఆ 7-8 కిలోమీటర్ల ప్రయాణం హిడ్మా గురించి, అక్కడి ఆదివాసీ ఉద్యమాలు, జనతన సర్కారు గురించి తెలుసుకోవటానికి సహాయపడ్డది. ఇక్కడి ప్రతి ఆదివాసీది డేగ కన్నే. ప్రతి గ్రామానిది మావోయిస్టులను తుద కంట కాపాడుకోవాలనే తపనే. హిడ్మా అంటే అక్కడి యువతలో ఒక క్రేజ్. బస్తర్ జిల్లా స్థానికుడు. ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. స్థానికులతో సులభంగా కలిసిపోతారట. తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ నేర్చుకోవటానికే ప్రాముఖ్యత ఇస్తాడని చెప్పారు. హిడ్మా అంబుష్ వేస్తే సాలీడు గూడు అల్లినట్టేనని, శత్రువు నిస్సహాయంగా అందులో చిక్కుకోవటమేనని చెప్పారు.
అడివి తల్లి గర్భాన్ని పగుల చీరి అందినన్ని రత్న ఖనిజాలు పోగేసుకోజూసే కార్పొరేట్ శక్తులకు అతను శత్రువే, వాళ్లకు కొమ్ముకాసే రాజ్యానికి మోస్టు వాంటెడ్ మావోయిస్టే. కానీ, అక్కడి ప్రజలకు అతనొక దేవుడు. జనతన రాజ్యంలో రోటి, కప్డా, ఔర్ మకాన్‌కు లోటు లేకుండా చేసిన అమరుడు. దోపిడీ పీడన పేదరికం మీద సర్కారు తృణీకరణ ఉన్నంతకాలం చట్టాలు, తుపాకీ గొట్టాలు వీటిని ఆపలేవు. హిడ్మాలు పోతే.. పువర్తి పల్లె బర్సీ దేవాను ఇచ్చిందంటున్నారు. ఆయన కాకుంటే ఇంకొకరు ఉద్యమాన్ని నడిపిస్తారు.
రవి పైరసీతోనే టాలీవుడ్ రూ.2,000 కోట్లు నష్టపోయిందని లెక్కలు కట్టి గగ్గోలు పెడుతున్నారు. రవి అనే దుండగుడు తమ కష్టార్జితాన్ని వీధిపాలు చేసిండని మొత్తుకుంటున్నారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌కు రూపం పోసి, పైరసీని వ్యవస్థీకృతం చేసిన రవి చర్యలు ముమ్మాటికీ నేరపూరితమే. కానీ, సాధారణ జనం సమర్థిస్తున్నారు. ఆకాశం మీద విహరించే తారల కొమ్ములు విరిచి నేలకు దించిన వీరునిగా కీర్తిస్తున్నారు. పరిస్థితి ఇంతదాకా తీసుకొచ్చిందెవరు? ఈ సినిమావాళ్లు కాదా? వాళ్లకు వంతపాడిన పాలకులు కాదా? నా బాల్యంలో వరి పంట ఇంటికొచ్చిన రోజులో మా నాయిన ఎడ్ల బండి కట్టి తుంగతుర్తి తడకల టాకీసుకు సినిమాకు తీసుకొని వెళ్లేవారు. మూడు మాన్కల వడ్లు అమ్మితే ఇంటిల్లిపాది సినిమా చూసి, ఆట మధ్యలో మిరప బజ్జీలు తిని, గోలిసోడా తాగి ఏడాదికి సరిపడ ఆత్మసంతృప్తితో ఇంటికి వచ్చేవాళ్లం. ఈ రోజుల్లో ఐమాక్స్, ఐనాక్స్, మాల్స్, మల్టీ స్క్రీన్ థియేటర్లలో జరిగే ఆర్థిక దోపిడీని తట్టుకొని సామాన్యుడు కుటుంబ సమేతంగా సినిమా చూడగలడా? ప్రీ రిలీజ్ ఈవెంట్లు, బెనిఫిట్ షోల టికెట్ల పందేరంతో పోటీపడి ఒక వ్యవసాయదారుడు సినిమా టికెట్లు కొనగలడా? సందు దొరికిందని సినిమావాళ్లు పైరసీ మీద పడిపోతున్నారు. మరి సినిమా వాళ్లు చేసిందేమిటి? వందేండ్లుగా జనజీవనంతో ముడిపడి ఉన్న సినిమాకు ఐమాక్స్ రంగులు పులిమి విలాసంగా మార్చేశారు. రూ.20లకు దొరికే నీళ్ల బాటిల్ రూ.200, రూ.30లకు వచ్చే పిల్లలు తినే పాప్ కార్న్‌ను రూ.500, రూ.30ల కూల్‌డ్రింక్ రూ.300 పెట్టి దోచుకుంటే.. మీ దోపిడీకి తాళలేకనే కదా జనం సినిమా థియేటర్లకు ఎడం జరిగింది.
దాసరి నారాయణరావు లాంటి పెద్ద మనుషులు సినీ పరిశ్రమను లీడ్ చేసిన కాలంలో వికలాంగులు, సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టుల సంక్షేమం కోసం, ప్రకృతి విపత్తులు, సీఎం సహాయనిధి కోసం బెనిఫిట్ షోలకు అనుమతులు తీసుకునేవారు. ఆ డబ్బును సమాజ హితం కోసం వినియోగించే సంకల్పం అది. కళామతల్లి ముద్దుబిడ్డలుగా ఆనాటి సినీ కళాకారులు సమాజానికి చేసినది సాంస్కృతిక సేవ. వినోదాన్ని వ్యాపారంగా మార్చిన వ్యాపారులు ఇప్పుడు బెనిఫిట్ షో స్వరూపాన్నే సమూలంగా మార్చేశారు. మొదటి మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్లు లాగేసుకునే ఆర్థిక వనరుగా చేసుకున్నారు. దీనికి వత్తాసు పలుకుతూ.. టికెట్ ధరలు పెంచి బెనిఫిట్స్ షోకు అనుమతించిన సర్కారు విశ్వసనీయతను ఎవరూ ప్రశ్నించవద్దు. ఇన్ని అరిష్టాల నుంచే కదా ఐబొమ్మ పుట్టి పెరిగింది. అది బప్పం టీవీ వరకు రూపాంతరం చెంది వెండితెర మీద మరకలు తుడిచింది. ఇమ్మడి రవి రూపాయి ఖర్చుతో జనాలకు ప్రశాంతంగా సినిమా చూపించాడు. సినిమా వాళ్లకు, పోలీసులకు చుక్కలు చూపెట్టాడు. పాలకులు చేయలేని పని తాను చేశాడు. అది చట్ట విరుద్ధమే అయినా అనివార్యమైంది. జనం స్వాగతించారు. రాబిన్ హుడ్‌తో పోల్చి మద్దతు ఇస్తున్నారు. ప్రేక్షకుల ముక్కు పిండి వసూలు చేసిన డబ్బు సరిపోలేదు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారు. ఇందులో మన తెలుగు సినిమా యాక్టర్లే ఎక్కువ. వీళ్ల జూదపు మాటలకు ఆకర్షితులై యువత బెట్టింగ్ మాఫియా వలలో పడింది. అప్పులు చేసి ఆన్లైన్ గేమింగ్ ఆడింది. ఉన్నదంతా పోగొట్టుకొని ఆత్మహత్యలను ఆశ్రయించింది.
2023 నుంచి ఇప్పటి వరకు ఒక్క తెలంగాణలోనే 1,023 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 1,200 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారిక నివేదికలు చెప్తున్నాయి. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు పోలీసులు సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని చనిపోయిన సంఘటనలు తెలంగాణ పోలీసు వ్యవస్థకు సవాల్ విసిరాయి.
సామాజిక, సామూహిక హత్యలకు ప్రేరేపించిన సినిమావాళ్లను ఏ చట్ట ప్రకారం శిక్షించాలి? ఎంతటి శిక్ష వేయాలి? భారతదేశంలో పిల్లలు రోజుకు 1,000 డాలర్ల వరకు జూదానికి ఖర్చు చేస్తున్నారని యునిసెఫ్ రిపోర్ట్ చెప్తున్నది. ఇది కేవలం వినోదం కాదని, ప్రజారోగ్య సంక్షోభంగా మారిపోయిందని ఈ రిపోర్ట్ అంటున్నది. వీళ్లను విచారణ చేస్తున్నారు సంతోషమే. డ్రగ్స్ తీసుకున్నారని సినిమా నటుల విచారణ కేసు సంవత్సరాలు సాగదీసి అటక మీద పెట్టినట్టు, బెట్టింగ్ యాప్‌ల విచారణను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టడానికే సాగదీస్తున్నారనేది జనం వాదన. దీనికి పోలీసులే సమాధానం చెప్పాలి.
ఐ బొమ్మను మూసివేస్తే వన్ బొమ్మ రూపం పోసుకుంటుంది. అదీ పోతే ఇంకో బొమ్మ తెరమీదికి వస్తుంది. ప్రభుత్వాలు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాల్సిన సమయం ఇది. పాలకుల మైండ్‌సెట్‌లో తిష్టవేసిన బొమ్మ మారాల్సిన సందర్భం ఇదే. చట్టం, న్యాయం మధ్య ఘర్షణ ఉన్నప్పుడు నైతికతను అనుసరించటమే ధర్మ సూక్ష్మం. అట్లా జన హృదయాలను గెలుచుకోవటమే ప్రజాస్వామ్యపు అసలైన కొలబద్ద.
-వర్ధెల్లి వెంకటేశ్వర్లు