న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) భారతదేశ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది చివర్లో నెతన్యాహు ఢిల్లీకి (India Visit) రావాల్సి ఉన్నది. భద్రతా కారణాలతో ఆయన తన పర్యటనను వాయిదా (Postpone) వేసుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని తన పర్యటనను వాయిదా వేసుకోవడం ఈ ఏడాది ఇది మూడో సారి. సెప్టెంబర్ 9న ఆయన ఢిల్లీకి రావాల్సి ఉన్నది. అయితే తమ దేశంలో సెప్టెంబర్ 17న ఎన్నికలు ఉండటంతో వాయిదా పడింది. అంతకుముందు ఏప్రిల్‌లో కూడా ఆయన పర్యటన వాయిదాపడిన విషయం తెలిసిందే.
కాగా, ఈ సారి ఢిల్లీ బాంబు పేలుళ్లే ఆయన పర్యటన వాయిదాకు కారణంగా తెలుస్తున్నది. రెండు వారాల క్రితం ఎర్రకోట వద్ద జరిగి ఆత్మాహుతి పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 15 మంది మరణించగా, డజన్ల కొద్ది గాయపడ్డారు. అయితే నెతన్యాహు వచ్చే ఏడాది భారత్‌లో పర్యటిస్తారని ఇజ్రాయెలీ మీడియా వెల్లడించింది. ఎప్పుడు వస్తారనేది త్వరలోనే ప్రకటిస్తారని పేర్కొంది.
నెతన్యాహు పర్యటన వల్ల ఇజ్రాయెల్-భారత్ మధ్య అంతరిక్ష పరిశోధనలు, రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, సాంకేతికత వంటి పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదరనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలోనే చాలా ఒప్పందాలు కొనసాగుతున్నాయి. తాజా పర్యటనలో ఇవి మరింత బలోపేతం కానున్నాయి. కాగా, నెతన్యాహు మొదటిసారిగా 2018, జనవరిలో భారత్‌లో పర్యటించారు. అంతకుముందు ఏడాది 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు వెళ్లారు. దీంతో టెల్అవీవ్లో పర్యటించిన మొదటి భారత ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచారు.