లక్నో: చైనా పౌరుడు(Chinese Man) ఒకరు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడు. 49 ఏళ్ల ఆ వ్యక్తిని .. సహస్త్ర సీమా బల్ దళాలు పట్టుకున్నాయి. ఇండో నేపాల్ సరిహద్దుల్లో ఉన్న రూపైదియా వద్ద అతన్ని అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బహరైచ్ జిల్లాలో ఈ ప్రాంతం ఉన్నది. అక్రమంగా ప్రవేశించిన ఆ వ్యక్తి.. బోర్డర్ దగ్గర వీడియో తీస్తున్నట్లు అతన్ని గుర్తించారు. అరెస్టు అయిన చైనా వ్యక్తి గతంలో పాకిస్థాన్‌లోనూ పర్యటించాడు. అతని వద్ద నుంచి పాకిస్థానీ, చైనీస్, నేపాలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
నేపాల్ నుంచి ఇండియాలోకి ప్రవేశించిన చైనా వ్యక్తి బోర్డర్‌ను వీడియో తీసినట్లు ఎస్ఎస్బీ 42వ బెటాలియన్ కమాండెంట్ గంగా సింగ్ ఉదావత్ తెలిపారు. అరెస్టు చేసిన చైనా వ్యక్తిని లియూ కుంన్జింగ్గా గుర్తించారు. చైనాలోని హునన్ ప్రావిన్సు నివాసితుడిగా తేల్చారు. భారత్‌లో ప్రవేశించడానికి అతని వద్ద డాక్యుమెంట్లు లేవు. మూడు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. అతని ఫోన్లలో చాలా సున్నిత ప్రదేశాలకు చెందిన వీడియోలు ఉన్నట్లు తేల్చారు.
నేపాల్‌కు చెందిన ఓ మ్యాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ మ్యాప్‌పై ఇంగ్లీష్‌లో రాశారు. కానీ ఆ వ్యక్తి మాత్రం తనకు హిందీ కానీ ఇంగ్లీష్ భాష కానీ రాదన్నారు. ఓ ఇంటర్ప్రిటర్ సహాయంతో సహస్త్ర సీమా బల్ బలగాలు అతన్ని ప్రశ్నించాయి. పాకిస్థాన్ వెళ్లిన అతనికి ఆదేశ వీసా ఉన్నట్లు తేలింది.