అనుకున్నట్టే అయింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వ్యవహారాన్ని పార్టీ స్థాయికి దిగజార్చింది. చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేమని మంత్రి పొంగులేటి ఇటీవల తేల్చిచెప్పారు. వ్యవహారం కోర్టులో ఉన్నదన్న సాకుతో పంచాయతీ ఎన్నికలను పాత రిజర్వేషన్ విధానంలో నిర్వహించడానికే నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. అదేమంటే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామని చెప్పుకొంటున్నారు. వాస్తవానికి ఇది ఊహించనిదేం కాదు, అసెంబ్లీ తీర్మానంతోనో, ఆర్డినెన్స్తోనో, రాష్ట్రస్థాయిలో చట్టం చేస్తేనో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడమనేది సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు తెలియని విషయం కాదు. కానీ, ప్రజలకు మాయమాటలు చెప్పి, మోసం చేయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య కదా!
విద్య అయినా, ఉద్యోగాలైనా, రాజకీయాలైనా రిజర్వేషన్ల వ్యవహారంలో అత్యంత కీలకమైన విషయం ఇంద్రా సహానీ కేసులో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితి. ప్రస్తుతం తెలంగాణలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు అటూ ఇటుగా 27 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. రిజర్వేషన్ గణాంకాలు కొంత సంక్లిష్టంగా ఉన్నా సుప్రీంకోర్టు విధించిన పరిమితికి లోబడే అమలవుతున్నాయి. అయితే, కాంగ్రెస్ చెప్తున్నట్టు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచితే అప్పుడు రిజర్వేషన్లు 50 శాతం పరిధిని దాటిపోతాయి. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 33 శాతానికి పెంచుతూ చట్టం చేసింది. అయితే, దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడం, సుప్రీంకోర్టు 50 శాతం పరిమితి దాటవద్దని స్పష్టం చేయడంతో అది అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు కూడా జరిగేది అదే. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా సుప్రీం కోర్టు 50 శాతం పరిమితి దాటాకూడదని పునరుద్ఘాటించింది.
బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలి. దీనికోసం రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకు కేంద్రం సహకరించాలి. ఒకవేళ కేంద్రం రాజ్యాంగ సవరణ చేసినా దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించాలి. అలా కాకుండా అంటే సుప్రీంకోర్టు సూచించిన ‘ట్రిపుల్ టెస్ట్’ను పాసయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించి రిజర్వేషన్లు సాధించాలి.
ఇదొక్కటే మార్గం తప్ప, వేరే మార్గం అంటూ ఏదీ లేదు. లేదా కాంగ్రెస్ వాదనను బట్టి తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. అలా చేస్తే ఆ చట్టం న్యాయ సమీక్ష కిందకు రాదనేది కాంగ్రెస్ వాదన. కానీ, ఏ చట్టమైనా, అది 9వ షెడ్యూల్లో ఉన్నా కూడా అది రాజ్యాంగ విరుద్ధమైనదని భావిస్తే న్యాయ సమీక్షకు వెళ్లాల్సిందే, 9వ షెడ్యూల్లో ఉన్న చట్టాలను కూడా సమీక్షించే అధికారం తమకు ఉన్నదని సుప్రీం కోర్టు 2007లో ‘ఐఆర్ కోయెలో వర్సెస్ తమిళనాడు’ కేసులో స్పష్టం చేసింది. అంటే, కాంగ్రెస్ చేస్తున్న వాదన బూటకం అని అర్థం చేసుకోవాలి.
బీసీలకు రిజర్వేషన్ పెంపుపై కాంగ్రెస్ చేస్తున్నదంతా ఉత్తుత్తి హంగామానే అని చిన్న పిల్లాడికైనా అర్థమవుతుంది. మొదట అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత చట్టం చేసి గవర్నర్‌కు పంపించింది. గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం లేకపోవడంతో మళ్లీ ఆర్డినెన్స్‌తో రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించింది. మళ్లీ చట్టం చేసి కేంద్రానికి పంపించింది. ఆ తర్వాత రిజర్వేషన్ల పెంపు కోసం జీవో 9 జారీచేసింది. ఒక జీవోతోనే రిజర్వేషన్లను పెంచే అవకాశం ఉంటే ఇంత హంగామా ఎందుకు చేసినట్టు? ప్రజలకు ఇది అర్థం కాదని కాంగ్రెస్ భావించిందా? తీరా ఇప్పుడు చేతులెత్తేసి, కోర్టు పేరు చెప్పి పాత విధానంలోనే ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది.
కాంగ్రెస్‌కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ముందు ప్రత్యేక కమిషన్‌తో రాష్ట్రంలో బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేయించాలి. బీసీల్లో ఏయే కులాలు విద్యాపరంగా, రాజకీయ పరంగా వెనుకబడ్డాయో గుర్తించాలి. పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలి. ఆయా వర్గాలకు ఎంత మేర రిజర్వేషన్ ఇవ్వాలనేది స్పష్టంగా పొందుపర్చాలి. అలా చేయడం వల్ల ఏ విధంగా లబ్ధి పొందుతాయనేది వివరించాలి. ఈ సమాచారాన్నంతా కోర్టు ముందుంచాలి. రాష్ట్రంలో బీసీల జనాభా సగం కంటే ఎక్కువ ఉన్నప్పటికీ వారు అత్యంత అసాధారణ స్థితిలో వెనుకబడి ఉన్నారని, వారికి మేలు చేయాలంటే 50 శాతం రిజర్వేషన్ పరిమితిని మించి వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరాలి. అందుకు అనుకూలమైన డాటాను సమర్పించాలి. మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లను పెంచు తూ ఆ రాష్ట్రం చట్టం చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. దీనికి సుప్రీంకోర్టు ‘ట్రిపుల్ టెస్ట్’ అని పేరు కూడా పెట్టింది. సుప్రీం కోర్టు సూచించిన విధంగా అధ్యయనం చేయకుండా, నివేదికలు సమర్పించకుండా రిజర్వేషన్లను గంపగుత్తగా 42 శాతానికి పెంచుతామంటే ఏ రకంగానూ సాధ్యం కాదు.
(వ్యాసకర్త: స్వతంత్ర జర్నలిస్ట్)
-ఎగుర్ల శ్వేత