హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఎల్అండ్టీలో గుట్టుగా లీజుల వ్యవహారం నడుస్తోంది. అయినవారికి అడ్డగోలుగా మెట్రో ఆస్తులను అడ్డికి పావుశేరు లెక్కన కట్టబెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎల్అండ్టీ చేతిలో ఉన్న కమర్షియల్ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతూ సర్కారు చోద్యం చూస్తున్నది. ఇప్పటివరకు లీజుల అంశాన్ని కేవలం ఎల్అండ్టీ పర్యవేక్షించేది. కానీ ప్రభుత్వం చేతిలోకి రావడమే ఆలస్యం అన్నట్లుగా, అయిన వారికి పప్పు బెల్లంలా సర్కారు దోచిపెడుతున్న దనే ఆరోపణలు వస్తున్నాయి.
-సిటీబ్యూరో, మార్చి 17(నమస్తే తెలంగాణ)
నగరంలో మెట్రో సంస్థకు మూడు మాల్స్‌ను ఎల్అండ్ టీ డెవలప్ చేసింది. నగరంలో ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా ఉన్న ఎర్రమంజిల్, పంజాగుట్ట, హైటెక్ సిటీ కేంద్రంగా వీటిని అభివృద్ధి చేసింది. దాదాపు రూ.15లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులో ఉంది. మెట్రో ద్వారా రాకపోకలు సాగించే వారికి వీలుగా వీటిని మెట్రో స్టేషన్లకు సమీపంలో నిర్మించింది. కానీ గడిచిన రెండేళ్ల కాలంగా నగరంలో ఈ మాల్స్ భవిత ప్రశ్నార్థకంగా మారింది. గతంలోనే ఈ మాల్స్‌ను ఓ సంస్థ దక్కించుకోగా, నిర్వహణ భారంతో తప్పుకున్నది. తాజాగా ఎల్అండ్టీ కూడా తప్పుకోవడంతో హాట్ కేకుల్లాంటి మెట్రో మాల్స్ కూడా రేవంత్ రెడ్డి బ్యాచ్‌ను ఆకర్షిస్తున్నాయి. వీటి ద్వారా రూ. వందల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉండటంతోనే రేవంత్ సర్కారు తీసుకున్న సొంత వ్యాపారానికి అనువుగా ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గుట్టుగా సాగుతున్న లీజుల పర్వం…
మెట్రో స్వాధీనానికి మరో 15-20 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. కానీ సర్కారులోని పెద్దలు అప్పటివరకు కూడా ఓపిక పట్టేలా కనిపించడంలేదని సమాచారం. ఈ క్రమంలో స్వాధీనానికి ముందే విలువైన కమర్షియల్ స్పేస్‌ను అయినోళ్ల చేతిలో పెట్టిస్తున్నట్లుగా సమాచారం. ఇదే విషయంపై సోషల్ మీడియాలోనూ విస్తృతమైన చర్చ నడుస్తోంది. ప్రధానమైన వ్యాపార కేంద్రంగా ఉన్న అమీర్‌పేట్, పంజాగుట్ట పరిధిలోని కమర్షియల్ స్పేస్ విషయంలోనే సర్కారు పెద్దల అడుగులకు ఉన్నతాధికారులు మడుగులొత్తిన చందంగా వ్యవహరిస్తున్నారు.
ఈ వ్యవహారంలో కీలకమైన కమర్షియల్ స్పేస్‌ను కూడా అడ్డికి పావుశేరు చొప్పున ప్రైవేటు వ్యక్తులకు రాసిస్తున్నారే ఆరోపణలు పలు అనుమానాలకు తావిస్తోంది. గతేడాది నవంబర్లోనే మెట్రో భూములే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారులోని కొందరు పెద్దలు తెరలేపిన అక్రమాల ప్రణాళికలను ‘మెట్రో భూములే తరువాయి’ ప్రస్తావిస్తూ నమస్తే తెలంగాణ కథనంలో కూడా పేర్కొంది. అప్పటి సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో కీలకమైన, విలువైన కమర్షియల్ ఆస్తులను పరిరక్షించేలా, కాంగ్రెస్ నేతల చేతికి చిక్కకుండా ఉండేలా అప్రమత్తం కూడా చేసింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఈ వ్యవహారంలో పావులు కదుపుతున్న ప్రభుత్వ పెద్దలు, విలువైన భూములను, కమర్షియల్ స్థలాలను అయినవారికి కట్టబెడుతున్నారు.
ఆ ఇద్దరి కనుసన్నుల్లోనే…
స్వాధీన ప్రక్రియ పూర్తి కాక ముందే లీజుల ద్వారా విలువైన భూములను కట్టబెట్టడంలో ఇద్దరు కీలక అధికారులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారే అనుమానాలు ఉన్నాయి. దీనిలో ప్రధానంగా మాజీ ఐఏఎస్ ప్రమేయంతోపాటు, నిర్ణయాధికారి హోదాలో ఉన్న మరో అధికారి కనుసన్నుల్లో వ్యవహారాన్ని కాంగ్రెస్ పెద్దలు నడిపిస్తున్నారు. లీజుల విషయం బయటపడకుండా గుట్టుగా సాగిస్తున్నారు. కానీ కొందరు కమర్షియల్ స్పేస్‌ల కోసం ప్రయత్నించి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చేరిన విధానాన్ని ప్రస్తావిస్తూ పలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్‌ను వివరణ కోరేందుకు నమస్తే తెలంగాణ ప్రయత్నించినా.. స్పందించలేదు. కనీసం ఈ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న అంశాలను అడిగి తెలుసుకునే వీల్లేకుండా ఫోన్ ద్వారా మాట్లాడేందుకు నిరాకరించారు.
స్వాధీనమైతే.. మెట్రో అన్యాక్రాంతమే..
మరో రెండున్నరేళ్ల కాంగ్రెస్ హయాంలో మెట్రో కమర్షియల్ స్థలాలకు రక్షణ లేకుండా పోతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ఎల్అండ్టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవడమే తరువాయి.. ఆలోగా మిగిలిన లక్షలాది చదరపు అడుగుల కమర్షియల్ ఆస్తులను అయినోళ్లకు చేతిలో పెట్టే ప్రక్రియ వేగంగా సాగిపోతుంది. ఇక ఒకసారి ప్రభుత్వం చేతిలోకి రాగానే.. మెట్రో కమర్షియల్ స్పేస్ మొత్తం కూడా అన్యాక్రాంతం అవుతుందని, ఆదాయం పేరిట పల్లీ బఠాణీలుగా సర్కారు పెద్దలు కావాల్సిన వాళ్లకు పంచిపెడుతారని పలువురు నిపుణులు ఆరోపిస్తున్నారు.