ఆమె బీఎస్సీ చదివింది. రెండు సంస్థల్లో కొద్ది కాలం ఉద్యోగం చేసింది. స్టార్టప్ స్టార్ట్ చేయాలని కొలువు వదిలి కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ‘చిన్న వయసు.. అనుభవం లేదు. ఆడపిల్ల రిస్క్ చేయలేదు. కుటుంబ వారసత్వం.. ఎవరో వెనుకుండి నడిపిస్తే ఎలా నడుస్తుంది?’ అని అందరూ అనుకున్నారు. వారసత్వం అబద్ధం. చిన్న వయసు నిజం. కానీ ఫలితం మాత్రం అందరూ ఊహించిన దానికి భిన్నం. రోజువారీ ఇంటి పనులు చక్కబెట్టేందుకు ‘ప్రాంటో’ పేరుతో మొబైల్ అప్లికేషన్ని తీసుకొచ్చింది. స్టార్టప్ పెట్టిన పదకొండు
నెలల్లోనే వంద మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది! ఇదీ 23 ఏండ్ల అంజలీ సర్దానా సామర్థ్యం, సాహసం, శ్రమ విలువ!
అంజలీ సర్దానా అమెరికాలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో బయాలజీలో బీఎస్సీ చేసింది. చదువు పూర్తయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు బైన్ క్యాపిటల్, 8 సీవీల్లో పనిచేసింది. అక్కడ ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మార్కెట్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించింది. ఆ సందర్భంలో ఇంటి పనివాళ్ల కొరత ఆమె దృష్టికి వచ్చింది. బెంగళూరు నగరంలో పనివాళ్లు దొరక్క టెకీలు పడే బాధలు చూసింది. అప్పటికే మార్కెట్లో గిగ్ వర్కర్స్ సర్వీస్‌లు, యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ, అవి అవసరానికి పనిమనిషిని ఇంటికి చేర్చలేవు. అందువల్ల చాలామందికి అనుకోకుండా పని పడినప్పుడు సాయపడేవాళ్లు ఉండరు. పని లేక రోజులో ఎక్కువ గంటలు ఖాళీగా ఉండే పనిమనుషులకు, అవసరానికి పనివాళ్లను ఉపయోగించుకోలేని వారిని కనెక్ట్ చేయడమే కాకుండా పది నిమిషాల్లో పనిమనిషిని ఇంటికి చేర్చాలని అంజలి అనుకుంది.

గుర్గావ్లో ఓ చిన్న భవనంలో ఆఫీస్ తెరిచింది. అప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు పోటీలో ఉన్నాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. ఏ కంపెనీ అందించలేని విధంగా పది నిమిషాల్లో పనిమనిషిని ఇంటికి పంపించాలన్నదే లక్ష్యంగా పెట్టుకుని యాప్‌ని రూపొందించింది. దీనికి తగ్గట్టే ఆమె పనిమనుషులతో మాట్లాడి వారిని ప్రాంటోలో చేర్చుకోవడంలో సక్సెస్ అయింది. టాయిలెట్లు, కిచెన్, ఫ్లోర్, రెయిలింగ్ శుభ్రం చేయడంలో వారికి శిక్షణ ఇచ్చింది. ఏ మరకలకు ఎలాంటి రసాయనాలు వాడాలో అవగాహన కల్పించింది. వంట చేయడం, అంట్లు తోమడం, దుస్తులు ఉతకడం, ఇస్త్రీ చేయడం, పసిపిల్లలను ఆడించడం, పెద్దవాళ్లను చూసుకోవడం ఇలా అన్ని అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ‘ప్రాంటో’ యాప్ స్టార్ట్ చేసింది.

గతేడాది ఏప్రిల్‌లో ప్రాంటో సర్వీస్ మొదలైంది. మొదటి రోజు 170 బుకింగ్స్‌తో మొదలైంది. సవాళ్లు, సమస్యలను అధిగమించేందుకు కంపెనీ సాఫ్ట్‌వేర్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కస్టమర్లకు నమ్మకమైన సేవలు అందిస్తున్నది అంజలి. వినియోగదారులకు కచ్చితమైన సమయానికి సేవలు అందించడానికి ఆమె కాలంతో పరుగులు తీసింది. అయితే, ఇదే ఇంటి పేరుతో బెంగళూరులో ఒక పెట్టుబడిదారుడు ఉన్నాడు. పేరు మోసిన వ్యక్తి కాబట్టి సుపరిచితుడే. అంజలి ఆయన కూతురు అనుకుని ఇందులో ఆమె ప్రతిభ ఏమీ లేదని కొందరు అనుకున్నారట. ఆయనే వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారని భ్రమపడ్డారట. కానీ, ఆ పేరుతో ఉన్న వ్యక్తి తమ బంధువు మాత్రమే! పైగా ఆమె విజయంలో ఆయన పాత్ర నామమాత్రంగా కూడా లేదని తర్వాత తెలుసుకున్నారు.

ఇంటి పనివాళ్లకు ఉన్న డిమాండ్ వల్ల ఈ స్టార్టప్ వేగంగా ఎదిగింది. సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో నెలకొల్పింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌తోపాటు మరికొన్ని ప్రధాన నగరాలకు ‘ప్రాంటో’ సేవలు విస్తరించాయి. ప్రతి షిఫ్ట్‌లో సుమారు నాలుగున్నర వేలమంది పనివాళ్లు అందుబాటులో ఉంటారు. ఆర్డర్లు పెరగడంతో పనిమనుషులకు శిక్షణ ఇస్తూ కొత్త నగరాలకు విస్తరిస్తున్నది ప్రాంటో. ఈ అవసరాల కోసం మూడు వేల మందికి శిక్షణ ఇచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై ప్రతి రోజూ 18 వేల బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. పది నిమిషాల్లోనే పనిమనుషులను పంపడం కోసం పట్టుదలతో పనిచేసిన అంజలి చివరికి విజయం సాధించింది. ఏడాదిలో పదివేల మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు రానున్న జూన్ నాటికి ప్రతి రోజూ 70 వేల బుకింగ్స్ సాధించాలని నిర్దేశించుకున్నది.
ప్రాంటో వినియోగదారుల సంఖ్య పెరగడం, ఇబ్బడిముబ్బడిగా ఆదాయం రావడంతో.. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. వెంచర్ క్యాపిటలిస్ట్‌లు ఇందులో భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడీ స్టార్టప్ విలువ 100 మిలియన్ డాలర్ల (830 కోట్ల రూపాయలు)కు చేరింది. అంజలీకి ప్రాంటోలో నలభై శాతం వాటా ఉంది. చిన్న వయసులోనే అంజలీ సర్దానా మిలియనీర్‌గా ఎదిగింది. అదికూడా పదకొండు నెలల కాలంలో. జీవితంలో ఎదగాలంటే, గెలవాలంటే కష్టపడటమే కాదు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడమూ ముఖ్యమని అంజలి విజయం చెబుతున్నది.