రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసమే పనిగా పెట్టుకున్నది. ఈ రెండేండ్ల రేవంత్‌రెడ్డి పాలనను చూస్తే ఈ విషయం మనకు అవగతమవుతుంది. గత పదేండ్లలో కట్టుడు దిశగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్లగా, ఈ రెండేండ్లలో కాంగ్రెస్ సర్కార్ మాత్రం కూల్చుడు దిశగా పరుగులు పెడుతున్నది. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికే రేవంత్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది. పెద్దలను వదిలిపెట్టి పేదల గూళ్లను కూల్చే కార్యక్రమాన్ని ముందట వేసుకున్నది. కాయకష్టం చేసుకొని పైసాపైసా కూడబెట్టి, లోన్లు తీసుకొని నిర్మించుకున్న పేదల ఇండ్లను సెలవు రోజుల్లో కూల్చేయడం దారుణం. ఇలాంటి దుర్మార్గాలను బీఆర్ఎస్ ఎన్నోసార్లు అడ్డుకున్నది. బాధితుల పక్షాన పోరాడింది.
నాడు ఎమర్జెన్సీ పేరుతో దేశ ప్రజలను ఇందిరమ్మ ఇబ్బందులకు గురిచేసింది. అలాగే నేడు ఇందిరమ్మ రాజ్యం పేరిట రేవంత్ రెడ్డి కూడా నిరుపేదలను నానా ఇబ్బందులు పెడుతున్నారు. పేద ప్రజలకు కూడు, గూడు లేకుండా చేస్తున్నారు. కనీసం కోర్టులకు వెళ్లే సమయమూ ఇవ్వకపోవడం శోచనీయం. కొందరు స్టే ఆర్డర్లు తెచ్చుకున్నా రేవంత్ సర్కార్ లెక్కచేయడం లేదు. అమీన్పూర్ ప్రాంతానికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి 2013లో స్థలం కొని ఇల్లు నిర్మించుకున్నారు. కానీ, అన్ని అనుమతులున్న ఆ ఇంటిని హైడ్రా అధికారులు కూలుస్తామన్నారు. ఆయన వెంటనే హైకోర్టుకు పోయిండు. అదే సమయంలో తన ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలిసి స్వయానా ముఖ్యమంత్రి సోదరుడు హైకోర్టుకు పోయిండు. సామాన్యుడైన మధుసూదన్‌తో పాటు ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా కోర్టు స్టే ఇచ్చింది. వాళ్ల ఇండ్లను కూల్చొద్దని చెప్పింది. అయినా హైడ్రా అధికారులు మధుసూదన్ ఇంటిని కూల్చేశారు. ఆయనతోపాటే స్టే ఆర్డర్ తెచ్చుకున్న ముఖ్యమంత్రి సోదరుడి ఇంటిని మాత్రం ముట్టుకోలేదు. పేదలకు ఒక నీతి.. పెద్దలకు మరో రీతి. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదే.
ఈ మధ్య చాంద్రాయణగుట్ట పరిధిలో పరీక్షలు జరుగుతుండగానే ఓ మైనారిటీ స్కూల్పైకి బుల్డోజర్లు దూసుకెళ్లాయి. అధికారులు నిర్దాక్షిణ్యంగా విద్యార్థులను బయటికి వెళ్లగొట్టారు. పరీక్షలు జరుగుతున్నాయని మొరపెట్టుకున్నా వినిపించుకోకుండా కూల్చేశారు. ఓవైసీకి చెందిన ఓ కళాశాల కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. కానీ, విద్యాసంవత్సరం మధ్యలో కూల్చితే విద్యార్థుల చదువులు ఆగమవుతాయని హైడ్రా కమిషనర్ సాకులు చెప్పారు. అంటే ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండే ఓవైసీ కాలేజీ విద్యార్థుల చదువులే డిస్ట్రబ్ అవుతాయా? ఇతర విద్యార్థుల చదువులకు విలువ లేదా? ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్న అనేక వర్గాలతో పాటు హైడ్రా బాధితుల తరఫున ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతున్నది. ప్రశ్నించే గొంతుకకు మద్దతుగా నిలవాలి. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. ఇకపై ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకుండా చేయాలి. కాంగ్రెస్ సర్కార్‌ను తరిమి తరిమి కొట్టాలి. అప్పుడే ఈ విధ్వంసం ఆగుతుంది.
-నిఖిల్ అల్లేని
96666 51215