‘మషాల్’ సినిమాలో దిలీప్‌కుమార్ తన భార్యకు తీవ్ర కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆమెను దవాఖానకు తీసుకెళ్లేందుకు వాహనదారుల సాయం అర్థిస్తాడు. స్థానికుల ఇండ్ల తలుపులు తడుతాడు. నా భార్యను కాపాడంటూ అటూ, ఇటు పరుగులు తీస్తాడు. మరోవైపు నొప్పి పెరిగి భార్య పిలుస్తూ ఉంటుంది. ఎవరి సహాయం లభించదు. చివరికి ఆమె ఊపిరి ఆగిపోతుంది. సినిమా చూసేవారిని ఆ సీన్ ఏడిపిస్తుంది. నేడు సమాజంలో జరుగుతున్న కొన్ని అమానవీయ ఘటనలు ఇలాగే ‘మనసున్న’వారికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కానీ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి మనమంతా మానవత్వంతో వ్యవహరించాలని గుర్తు పెట్టుకోవాలి.
మధ్యప్రదేశ్‌లోని మహా నగరంగా పేరొందిన ఉజ్జయినిలో ఇటీవల 12 ఏండ్ల లైంగిక దాడి బాధితురాలు అర్ధనగ్నంగా చిరిగిన బట్టలతో, గాయాలతో స్థానికుల ఇండ్ల తలుపులు తడుతూ, పిలుస్తూ తనను రక్షించాలని వేడుకుంది. కనీసం ఆమె ఎవరు? ఎందుకు తమ ఇంటిముందుకు వచ్చిందని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయలేదు. ఏదో పని మీద బయటకు వెళ్తున్న ఒకతను భార్యను బయటకు పిలిచేలోపు ఆ అమ్మాయి వెళ్లిపోయింది. ఈ సంఘటన మనుషుల్లో మానవత్వం ఎంతగా కనుమరుగైపోతున్నదో తెలియజేస్తున్నది. మనుషులు ఎంత స్వార్థపరులైపోయారో తెలుపుతున్నది.
ఇదే బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఒక మహిళను భర్త బట్టలూడదీసి నగ్నంగా గ్రామంలో ఊరేగించాడు. బీజేపీ కార్యకర్త ఒకరు ఆదివాసీ యువకుడి మీద మూత్రం పోశాడు, అటు మణిపూర్ ఇంకా మండుతూనే ఉంది. 165 మందికి పైగా మరణించారు. ఇద్దరు మహిళలను దుండగులు నగ్నంగా ఊరేగించిన సంఘటనను ఎవరు ఇంకా మరిచిపోలేదు. నిజ నిర్ధారణకు వెళ్లి వాస్తవ నివేదిక తయారుచేసిన ఎడిటర్స్ గిల్డ్ జర్నలిస్టుల మీద ప్రభుత్వం కేసులు పెట్టింది. తాజాగా మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్, హత్య సంఘటన వెలుగు చూసింది. సంఘటనపై నిరసన తెలపడానికి సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులతో భద్రతాదళాలు ఘర్షణకు దిగడం, ఇందులో 50 మంది దాకా గాయపడ్డారు. మణిపూర్‌ను కల్లోల ప్రాంతంగా సీఎం బీరేన్ సింగ్ ప్రకటించారు. మణిపూర్‌లో హింస మొదలై దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఒక్కసారి కూడా మణిపూర్‌కు వెళ్లలేదు. నిజానికి పీఎం మోదీకి ముందు మణిపూర్‌కు వెళ్లాలనిపించాలి కదా? అది సాధ్యం కాని పని అనకతప్పదు! భారత్‌లో ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితి ఉంది.
గడిచిన తొమ్మిదేండ్లలో మహిళల మీద దాష్టీకాల సంఘటనలు గతం కన్నా చాలా ఎక్కువనే జరిగాయి, జరుగుతున్నాయి. కేంద్రం ‘బేటీ బచావో, బేటీ పడావో’ అనే నినాదం వట్టి జుమ్లా అయిపోయింది. బూటకపు ముచ్చటైంది. దేశంలో మహిళల మీద జరిగే దాష్టీకాలను ప్రతీచోట రాజకీయం చేయడం, మెజారిటీ ప్రభుత్వ ఒడిలో ఒదిగిన, కేవలం విద్వేషాలను ప్రచారం చేయడం కోసం పనిచేస్తున్న కొన్ని మీడియా సంస్థలు కూడా అదే కోణంలో ప్రచారం చేయడం దురదృష్టకరం. భారతదేశంలో మహిళలను దేవి అంటూ పూజిస్తారు. ‘బేటీ (బిడ్డ) ఉన్న ఇంట్లో రోటీ (రొట్టె, బువ్వ)కి కొదవుండదు బేటా’ అనేది మా అమ్మ. ‘బేటీ రోటి హీ నహీ, లక్ష్మి’ అని కూడా అంటాం. బిడ్డ పుట్టిందంటే, ఆ ఇంటికి లక్ష్మి వచ్చిందని ఇంటిల్లిపాది సంతోషం వ్యక్తం చేస్తుంది. అలాంటి బిడ్డల పట్ల దేశంలో వ్యవహారం ఏ మాత్రం బాగోలేదు.
ఉజ్జయిని లాంటి ప్రాంతంలో పన్నెండేండ్ల బాధిత బాలిక సహాయం కోసం ప్రతి ఇంటి తలుపులు తట్టినపుడు ఆమె పట్ల స్థానికులు వ్యవహరించిన తీరు, సభ్య సమాజం ముందు మానవత్వాన్ని.. ఓ మనిషి ఏందిది? అంటూ ప్రశ్నించినట్టు అనిపిస్తున్నది. దేశ జనాభాలో 69 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వారికి సమాన హక్కులు ఎలాగూ ఇస్తలేరు, కనీసం వారి రక్షణకైనా హామీ ఇవ్వండి! అమ్మా..ఉజ్జయినిలో నీ పట్ల అమానవీయంగా వ్యవహరించిన ఆ ప్రాంత వాసులను శపించకు! క్షమించు! అయితే అక్కడే కొద్ది దూరంలో ఆమె గోడు విని బట్టలిచ్చి, పోలీసులకు చెప్పి, సహాయం చేసిన గుడి పూజారికి, బాలికకు తమ రక్తం ఇచ్చి ఆదుకున్న పోలీసులకు అభినందనలు! మనుషులూ మారండి! తోటివారిని, ముఖ్యంగా బాధితులను, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోండి! ఒకరిని ఆదుకోడానికి, పదవులు, ప్రోటోకాల్‌లు అవసరం లేదు, గుప్పెడు మనసు ఉంటే చాలని గుర్తించండి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు)
– ఎండీ మునీర్ 99518 65223