Srinivas Goud | ప్రభుత్వం ఇచ్చినచీర కట్టుకొని ఓట్లు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మరి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చీరలు ఇవ్వలేదని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన చీర కట్టుకొని ఓటు వేయండని బహిరంగంగా ముఖ్యమంత్రి అంటున్నారని. మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఎక్కడకు పోయింది? ఉందా నిద్రపోయిందా అని ప్రశ్నించారు. బీజేపీ ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్టు ఉంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఉందని విమర్శించారు.
రెండేళ్ల నుంచి ఎక్కడకు పోయారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు ఎక్కడకు పోయాయని నిలదీశారు. అవ్వ తాతకు ఇస్తానని చెప్పిన పెన్షన్ ఎక్కడకు పోయిందని అడిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగులకు బీసీ రిజర్వేషన్ల పై మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఎన్నో రకాల మోసాలను ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిందని విమర్శించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ఒక్క బీసీ సర్పంచ్ లేడు అని.. మహబూబ్నగర్లో చాలా గ్రామాల్లో బీసీ సర్పంచ్లు లేరు, వార్డు మెంబర్లు లేరని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లకు 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డు మెంబర్లకు ఇస్తారని.. సర్పంచ్లకు మాత్రం అది ఇవ్వరని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఎక్కడ నియమ నిబంధనలు పాటించడం లేదని తెలిపారు.
బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిట్టనిలువుగా ముంచిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను తుంగలో తొక్కిందని విమర్శించారు. విద్యార్థుల్లారా మీ భవిష్యత్తు కోసం మా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని అన్నారు. అసెంబ్లీలో విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవుల గురించి బిల్లు పాస్ చేశారు కానీ ఇప్పుడు విద్య, ఉద్యోగాలు ఎక్కడకు పోయాయి. ఆ బిల్లును ఎందుకు రాష్ట్రపతికి పంపలేదని ప్రశ్నించారు. అనేక హామీలను ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. బీసీలకు మంత్రి పదవులు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
సర్పంచ్ ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని అన్నారు. కొడంగల్ నియోజకవర్గం ఒక్కటే అభివృద్ధి కాదు.. పాలమూరు రంగారెడ్డి ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డవే కదా ఏమైందని నిలదీశారు. ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చెందితే అభివృద్ధి కాదు కదా అని అన్నారు. రాజ్యాధికారం ఎక్కడకు పోయిందని అడిగారు. కేంద్రంలో బీసీలకు ఒక్క మంత్రిత్వ శాఖ లేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన వారికి ఓటు వేస్తే మరింత మోసమే జరుగుతుందని అన్నారు. ఏ పార్టీలో గెలిచినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడని ప్రచారం చేసుకుంటారు కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామని పీసీసీ అధ్యక్షుడు అన్నారని.. ఆ మాట ఎక్కడికి పోయిందని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నోట కూడా అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే అని ఆయన స్పష్టం చేశారు. రెండు సంవత్సరాల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బీఫామ్ లేని ఎన్నికలు ఇవి అని.. అలాంటిది పార్టీ నుంచి గెలిపిస్తామని అనడం ఏంటని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రూ.3వేల కోట్లు వెనక్కిపోతాయని కిషన్ రెడ్డి అనగానే.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు వెళ్తున్నాడని తెలిపారు. రూ.3వేల కోట్లకు చూసుకుంటే బీసీలు నిలువునా మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 2014కు ముందు ఏముంది.. ఇప్పుడు ఏముంది ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు. ఏ ఎన్నిక వచ్చిన ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఇప్పటికీ మోసపోయి గోసపడుతున్నామని తెలిపారు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారని అన్నారు.