e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

గొర్రెల యూనిట్ ధ‌ర రూ.1,75,000గా నిర్ణ‌యం

గొర్రెల యూనిట్ పెంచిన ధరను రూ. 1,75,000 గా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇప్పటికే డీడీలు కట్టి ఉన్న 14 వేల మంది అర్హులకు కూడా పెంచిన ధరను వర్తింపజేయాల‌ని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం.. రెండో విడ‌త గొర్రెల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని త్వ‌రలోనే చేప‌ట్టాల‌ని ఆదేశించారు. రాజస్థాన్‌ను మించి షీప్ పాపులేషన్‌లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకున్నదని అన్నారు.

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు పెంపునకు సీఎం నిర్ణయం

- Advertisement -

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26న జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది.

తెలంగాణలో భూముల విలువ పెంచుతూ ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఈ నూతన ధరలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. వ్య‌వ‌సాయ భూముల విలువ‌లు మూడు స్లాబులుగా(50 శాతం, 40 శాతం, 30 శాతం) పెంచుతూ నిర్ణ‌యం వెలువ‌రించారు. ఓపెన్ ప్లాట్ల క‌నీస ధ‌ర చ‌ద‌రపు గ‌జం రూ.100 నుంచి రూ.200 పెంపు. అదే అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల విలువ‌ను చ‌ద‌ర‌పు అడుగుకు 20 శాతం, 30 శాతంగా పెంచారు. భూముల విలువ‌ల‌కు సంబంధించిన‌ ఏవైనా స‌మ‌స్య‌ల‌పై సంప్ర‌దించాల్సిన టోల్‌ఫ్రీ నంబ‌ర్ 1800 599 4788. ఈమెయిల్ చిరునామా [email protected]

కోకాపేట‌, ఖానామెట్ భూముల వేలంపై ఆరోప‌ణ‌లు నిరాధారం

కోకాపేట‌, ఖానామెట్ భూముల వేలంపై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు నిరాధారం అని రాష్ట్ర‌ ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. ఈ మేర‌కు ఆ భూముల వేలంపై ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ఇటీవ‌ల చేప‌ట్టిన భూముల వేలంలో విధాన‌ప‌ర‌మైన అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని కొన్ని వార్తా ప‌త్రిక‌ల‌లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై రికార్డుల ఆధారంగా ప్ర‌జ‌ల‌కు తెలుపాల్సిన బాధ్య‌త ఉన్న‌ద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

కొవిడ్‌ టీకా తీసుకున్న‌ మంత్రి కేటీఆర్‌

మంత్రి కేటీఆర్ మంగళవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్నికేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తనకు టీకా వేసిన డాక్టర్‌ శ్రీకృష్ణ, నర్సు కెరినా జ్యోతికి మంత్రి ఈ సంద‌ర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కరోనా విపత్తు వేళల్లో సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన ఆరోగ్య కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

హుజురాబాద్ అభివృద్ధి కోస‌మే టీఆర్ఎస్‌లో చేరుతున్నా : కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాన‌ని కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. కొండాపూర్‌లోని త‌న నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కౌశిక్ రెడ్డి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ ఆమోదం

ఐపీఎస్ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణను ప్ర‌భుత్వం ఆమోదించింది. 26 ఏండ్ల సర్వీస్‌ పూర్తిచేసిన ఈ ఐపీఎస్‌ అధికారి ప్రస్తుతం అడిషనల్‌ డీజీ ర్యాంక్‌లో ఉన్నారు. ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం ట్విట్టర్‌లో వెల్లడించారు. రాజ‌కీయాల్లోకి రావ‌డ‌మా లేదా అన్న‌ది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ప్ర‌వీణ్‌కుమార్ తెలిపారు.

దేశంలోనే తొలిసారి.. హైద‌రాబాద్‌లో ట్రాన్స్‌జెండ‌ర్ క్లినిక్‌లు

దేశంలోనే తొలిసారిగా రెండు ట్రాన్స్‌జెండ‌ర్ క్లినిక్‌ల‌ను హైద‌రాబాద్‌లో నెల‌కొల్పారు. ట్రాన్స్‌జెండ‌ర్ ప‌ర్స‌న్స్ యాక్ట్, 2019 ప్ర‌కారం.. ప్ర‌తి మెట్రో సిటీలో ట్రాన్స్ జెండ‌ర్ క్లినిక్ ఉండాల‌న్న నిబంధ‌నకు లోబ‌డి కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగా హైద‌రాబాద్‌లో ఈ రెండు క్లినిక్‌ల‌ను ప్రారంభించారు.

ఏపీలో మరో వారంపాటు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

కరోనా కారణంగా మార్చిన ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపింది. అలాగే రాత్రి క‌ర్ఫ్యూను మ‌రో వారం పాటు పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి మరిసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధన అమలులో ఉండనుంది.

ఏపీలోని 3 చారిత్రక కట్టడాలకు ఆదర్శ స్మారకాలుగా గుర్తింపు

ఏపీలోని పలు చారిత్రక నిర్మాణాలకు విశిష్ట గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని 3 చారిత్రక కట్టడాలను ఆదర్శ స్మారకాలుగా గుర్తించినట్టు కేంద్ర పర్యాటకశాఖ వెల్లడించింది. గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ఆదర్శ స్మారకాల జాబితాలో చేర్చింది. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో కడప జిల్లా గండికోటకు స్థానం కల్పించినట్టు తెలిపింది.

మిస్ ఇండియా యూఎస్ఏ 2021 విజేత‌గా వైదేహి డోంగ్రే

మిస్ ఇండియా యూఎస్ఏ 2021 కిరీటాన్ని మిషిగ‌న్‌కు చెందిన వైదేహి డోంగ్రే(25) కైవ‌సం చేసుకుంది. ఈ అందాల పోటీల్లో జార్జియాకు చెందిన‌ అర్షి ల‌లాని మొద‌టి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. అందాల పోటీలో విజేత‌గా నిలిచిన అంశాన్ని త‌న ఇన్‌స్టాగ్రాం పేజీ ద్వారా తెలుపుతూ డోంగ్రే ప‌లు చిత్రాల‌ను పంచుకుంది. 

67 శాతం మందిలో క‌రోనా యాంటీబాడీలు

భార‌త దేశ‌ జ‌నాభాలో మూడింట రెండు వంతుల మందిలో క‌రోనా యాంటీబాడీలు వృద్ధి చెందిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. ఇంకా 40 కోట్ల మందికి ఈ వైర‌స్ ముప్పు పొంచి ఉన్న‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా నాలుగో జాతీయ సెరో స‌ర్వేను రిలీజ్ చేసింది.

భార‌తీయ విమానాల‌పై బ్యాన్‌ను పొడిగించిన కెన‌డా

భార‌తీయ విమానాల‌పై కెన‌డా ఆంక్ష‌ల‌ను పొడిగించింది. ఆగ‌స్టు 21వ తేదీ వ‌ర‌కు భార‌త‌దేశం నుంచి వ‌స్తున్న విమానాల‌పై స‌స్పెన్ష‌న్ విధించిన‌ట్లు కెన‌డా ప్ర‌భుత్వం తాజాగా పేర్కొన్న‌ది. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ఇండియా, పాక్ నుంచి వెళ్లే విమానాల‌పై కెన‌డా బ్యాన్ విధించింది.

బెజోస్‌ స్పేస్‌ జర్నీ సక్సెస్‌.. 11 నిమిషాల్లో 105 కిలోమీటర్ల ప్రయాణం

అమెజాన్‌ సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా ముగిసింది. 11 నిమిషాల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించి భూమికి తిరిగివచ్చారు. బెజోస్‌ వెంట మరో ముగ్గురు కూడా అంతరిక్ష ప్రయాణం చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.42 నిమిషాలకు పశ్చిమ టెక్సాస్‌ నుంచి రోదసీలోకి బయల్దేరిన బ్లూ ఆరిజిన్‌ సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ స్పేస్‌ క్రాఫ్ట్.. తిరిగి 11 నిమిషాల్లో భూమికి చేరుకున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు
NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు
NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

ట్రెండింగ్‌

Advertisement