Dharmapuri Arvind | నిజామాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయంటే ఎంపీలంతా అందుకు సంసిద్ధులై ఢిల్లీకి పయనం అవుతారు. తమ ప్రాంత ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను పార్లమెంట్ వేదికగా ప్రస్ఫుటం చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ప్రయత్నాన్ని గతంలో అనేక మంది ఎంపీలు నిజామాబాద్ ప్రాంతం నుంచి గెలిచిన వారంతా చేసిన వారే. 2014 నుంచి 2019 వరకు బీఆర్ఎస్ ఎంపీగా కల్వకుంట్ల కవిత పనితీరు ఇందుకు చక్కని ఉదాహరణ. జమ్మూ కశ్మీర్ పండిట్ల వ్యవహారం నుంచి దేశవ్యాప్త సమస్యలపై, లింగ సమానత్వంపై, తనను గెలిపించిన నిజామాబాద్ ప్రాంత పసుపు రైతుల ఆశయం కోసమై నిత్యం పోరాటం చేశారు. సందర్భం చిక్కినప్పుడల్లా లోక్‌సభలో కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించేవారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో సమాధానాన్ని సైతం రాబట్టేవారు. అలాంటి ప్రయత్నం ఇప్పుడున్న ఎంపీ అర్వింద్‌లో ఇసుమంతా లేకపోవడం విడ్డూరంగా మారింది. జిల్లా సమస్యలపై గొంతెత్తి కేంద్రాన్ని అడిగిన దాఖలాలు ఒక్కటంటే ఒక్కటీ లేదు. తానిచ్చిన హామీ కోసం కూడా చిన్న ప్రయత్నం కూడా చేయకపోవడం విడ్డూరంగా మారుతున్నది.
భారతీయ జనతా పార్టీ తరపున దొంగ హామీలతో రైతులను మోసం చేసి ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అర్వింద్ 2019, మే నెలలో పదవిని చేపట్టారు. కేంద్రంలోనూ రెండోసారి ఎన్డీయే సర్కారు కొలువుదీరింది. అధికార పార్టీ ఎంపీగా నిజామాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో జిల్లాను ఎంతో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎంపీపై ఉంది. కేంద్రం ద్వారా నిధులను మంజూరు చేయించడం ద్వారా అనేక రకాలుగా తనకంటూ ప్రత్యేకతను చాటుకోవచ్చు. కానీ ఎక్కడా ఇలాంటి ప్రయత్నం చేసినట్లు మచ్చుకూ అర్వింద్ వ్యవహారంలో కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ఎంపీ పదవిని కేవలం ఇతర పార్టీల నేతలను తిట్టడానికి మాత్రమే వాడుకోవడం, సోషల్ మీడియా లేదంటే టీవీ చర్చల్లో సంచలన ప్రకటనలతోనే పరిమితం కావడానికి ఇచ్చిన ప్రాధాన్యత నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధిపై చూపిన మమకారం అంటూ ఏమీ లేదు. అర్వింద్ ఎంపీ అయిన తర్వాత లోక్‌సభ 10 సార్లు సమావేశమైంది. ఇందులో అర్వింద్ మైక్ అందుకుని మాట్లాడింది కేవలం 2 సార్లు మాత్రమే. అందులో ఒకసారి ఇతర అంశంపై మాట్లాడగా ఒకే సారి నిజామాబాద్ గురించి మాట్లాడినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ప్రస్తుతం మార్కెట్‌కు పసుపు పంట వస్తున్నది. నెల రోజులుగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు వేలాది బస్తాల పసుపు వచ్చి చేరుతున్నది. సీజన్ ఆరంభమై రోజులు గడుస్తున్నప్పటికీ గిట్టుబాటు ధర మాత్రం ఒక్క రైతుకు కూడా దక్కకపోవడం బాధాకరంగా మారింది. జనవరి 2వ తారీఖు నాడు నిజామాబాద్ మార్కెట్లో కమ్మర్‌పల్లికి చెందిన ఒక రైతుకు క్వింటాలు పసుపునకు రూ.3,300 కనిష్ఠ ధర మాత్రమే వచ్చింది. ఇప్పుడదీ గరిష్ఠంగా క్వింటాలుకు రూ.5వేలు దాటకపోవడంతో రైతులకు ఆశానిపాతంలా మారుతున్నది. ఇలాంటి విపత్కర దుస్థితిలో రైతులకు అండగా నిలవాల్సిన ఎంపీ మాత్రం పార్లమెంట్ సమావేశాల పేరుతో ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. అలాగనీ జిల్లాలో నెలకొన్న పసుపు రైతుల బాధలను ఆలకించి కేంద్రంతో మాట్లాడిందీ లేదు. గతంలో ఇదే హోదాలో పని చేసిన కల్వకుంట్ల కవిత మాత్రం నిరంతరం ప్రజల ఆలోచనలను, ఆకాంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుంచి లాభం చేకూర్చారు. కీలకమైన పసుపు బోర్డు అమలు కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయం ఏర్పాటును తిరస్కరించి పసుపు బోర్డు కోసం గట్టిగా కృషి చేసి చిరస్థాయిగా నిలవగా… ఎంపీ అర్వింద్ ఇందుకు పూర్తి భిన్నంగా ఉండడం విశేషం. తానిచ్చిన హామీని సైతం తుంగలో తొక్కి నోరు విప్పకపోవడంపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు.
Adani Group | హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఎఫెక్ట్.. 7000 కోట్ల టేక్వర్ను వదిలేసుకున్న అదానీ గ్రూప్