కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా విషయంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు, నల్లజెండాలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి ఎన్.సంజీవులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సింగరేణి సంస్థకు వచ్చిన రూ.6,094 కోట్ల లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ కూడా ఉందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి కార్మికులతో సమానంగా పనులు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు కేవలం రూ.5,500 మాత్రమే ప్రకటించడం అంటే కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేయడమే అని విమర్శించారు.
సింగరేణిలో గుర్తింపు సంఘం ప్రాతినిధ్యం సంఘం కాంటాక్ట్ కార్మికులకు ఏమాత్రం లాభాల వాటా పెంచడానికి ప్రయత్నం చేయలేదని, ఏదైనా చేస్తే తామే చేయాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర మీటింగ్లు పెట్టే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం రూ.10 వేలు ఎందుకు ఇప్పించలేకపోయారో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు రూ.20 వేలు లాభాల వాటా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డివిజన్ నాయకులు కరుణ, సంధ్య, లక్ష్మి నరసింహ, రామకృష్ణ, పాషా, కృష్ణ, లక్ష్మణ్ పాల్గొన్నారు.