Huge pumpkin : సాధారణంగా గుమ్మడికాయలు (Pumpkins) మూడు, నాలుగు కిలోల బరువు ఉంటాయి. మహా అయితే కొన్ని గుమ్మడికాయలు 10 కిలోల బరువు తూగుతాయి. అత్యంత అరుదుగా కొన్ని గుమ్మడి కాయలు సుమారుగా 20 కిలోల వరకు బరువు పెరగవచ్చు. కానీ ఆ రైతు (Farmer) పండించిన గుమ్మడికాయ మాత్రం ఏకంగా 969 కిలోల బరువు ఉంది. అతిపెద్ద గుమ్మడికాయ (Huge pumpkin) ను పండించిన రైతుగా ఆయన రికార్డు సృష్టించాడు.
వివరాల్లోకి వెళ్తే.. రష్యాకు చెందిన అలెగ్జాండర్ చుసోవ్ అనే రైతు అతిపెద్ద గుమ్మడికాయను పండించి రికార్డు నెలకొల్పాడు. మాస్కోలో జరిగిన భారీ కూరగాయల పోటీల్లో ఆ భారీ గుమ్మడికాయను ప్రదర్శించారు. దాని బరువు ఏకంగా 969 కిలోలు ఉంది. దాంతో అది రష్యాలోనే అతిపెద్ద గుమ్మడికాయగా రికార్డుల్లోకి ఎక్కింది.
ఆ భారీ గుమ్మడి కాయను పండించేందుకు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం పట్టిందని రైతు చుసోవ్ వెల్లడించారు. నేల, గాలిని వేడిచేసే ప్రత్యేక గ్రీన్ హౌస్‌ను నిర్మించి అందులో జాగ్రత్తగా దీన్ని పండించినట్లు చెప్పారు. ఎరువులు, నీటిని కచ్చితమైన మోతాదులో అందించినట్లు వివరించారు. ఈ పోటీల్లో దాదాపు మూడు వేల మందికిపైగా రైతులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. కాగా పోటీల్లో 144 కేజీల బరువున్న పుచ్చకాయ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని నిర్వాహకులు వెల్లడించారు.