కారేపల్లి, సెప్టెంబర్ 23 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని మాదారం, ఉసిరికాయలపల్లి, పేరుపల్లి గ్రామ పంచాయతీలో ఆది కర్మయోగి సేవా కేంద్రాలను ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.విజయలక్ష్మి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి గ్రామాల్లో ర్యాలీ తీసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆది కర్మయోగి పథకం 10.5 కోట్ల మంది గిరిజన ప్రజలను లక్ష్యంగా చేసుకుని, 20 లక్షల మంది శిక్షణ పొందిన కార్యకర్తల ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. గ్రామీణ స్థాయిలో సేవలను మెరుగుపరచడం, గిరిజన సంస్కృతిని సంరక్షించడం, స్థానిక ప్రజలు పాల్గొనడాన్ని ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలన్నారు.
భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో వికేంద్రీకృత గిరిజన నాయకత్వం, పాలనను ప్రోత్సహిస్తుందన్నారు. గిరిజన సమాజాలను సాధికారపరచడం, స్థానిక నాయకత్వ అవకాశాలను సృష్టించడం, సంక్షేమ పథకాల అమలును మెరుగుపరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ ఎల్.రాములు, ఐసీడీఎస్ సూపర్వైజర్ మాలతి, పంచాయతీ కార్యదర్శులు నిరంజన్, విజయ్, సురేష్, ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల సీనియర్ అసిస్టెంట్ పాషా, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్, గ్రామ సమాఖ్య సభ్యులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.