ముంబై, మార్చి 5: అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఎట్టకేలకు గురువారం కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ప్రధాన సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 899.71 పాయింట్లు లేదా 1.14 శాతం ఎగబాకి మళ్లీ 80 వేల మార్కు ఎగువకు చేరి 80,015.90 వద్ద స్థిరపడింది.
దీంతో మదుపరుల సంపద రూ.6 లక్షల కోట్లు ఎగిసింది. ఒకానొక దశలోనైతే 1,187.64 పాయింట్లు పుంజుకోవడం విశేషం. దీంతో 4 రోజుల నష్టాలకు బ్రేక్ పడినైట్టెంది. ఇక ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ కూడా 3 రోజుల నష్టాలకు తెర దించుతూ 285.40 పాయింట్లు లేదా 1.17 శాతం ఎగసి 24, 765.90 వద్ద నిలిచింది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో దాదాపు వారం రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అయితే ఇన్నాళ్లూ అమ్మకాల ఒత్తిడిలో ఉన్న మదుపరులు.. మళ్లీ ఇప్పుడు కొనుగోలుకు పెద్దపీట వేశారు.
మిడిల్ ఈస్ట్‌లో ఏర్పడిన సంక్షోభం ఇకపై సద్దుమణుగుతుందా? లేదా ఇంకా తీవ్రతరమవుతుందా? అన్న అనిశ్చిత పరిస్థితులున్నప్పటికీ మదుపరులు పెట్టుబడులకే మొగ్గు చూపారని తాజా ట్రేడింగ్ సరళిని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికాకు అండగా నిలుస్తున్నాయని పొరుగు దేశాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇరాన్.. తమ పరిధిలోని హొర్ముజ్ జలసంధిని మూసివేసింది. ఇది ఆ మార్గం ద్వారా నిత్యం రాకపోకలు జరిపే వందలాది ముడి చమురు, ఇతరత్రా సరుకు రవాణా నౌకలపై ప్రభావం చూపింది. జలసంధికి ఇరువైపులా ఎక్కడివి అక్కడే ఆగిపోవడంతో వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ రవాణాలకు ఇబ్బంది ఏర్పడుతున్నది.
అలాగే ఇరాన్ దాడులతో మిగతా గల్ఫ్ దేశాలన్నీ చమురు, గ్యాస్ ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చింది. ఫలితంగా డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 82.90 డాలర్లు పలుకుతున్నది. ఈ పరిణామం భారత్ సహా అన్ని దేశాలను భయపెడుతుండగా.. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్లు తిరిగి మదుపునకు ప్రాధాన్యం ఇవ్వడంతో సూచీలు కోలుకున్నాయి.
సెన్సెక్స్ షేర్లలో అదానీ పోర్ట్స్, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇండిగో షేర్లు భారీ లాభాలను పొందాయి. రంగాలవారీగా.. సేవా రంగ షేర్లు అత్యధికంగా 2.84 శాతం వృద్ధిని చూపాయి. అలాగే యుటిలిటీస్ (2.58 శాతం), విద్యుత్తు (2.41 శాతం), మెటల్, ఇండస్ట్రియల్స్ (2.32 శాతం), ఆటో (1.95 శాతం), రియల్టీ (1.91 శాతం), ఎనర్జీ (1.83 శాతం), కమోడిటీస్ (1.72 శాతం) లాభపడ్డాయి. ఇక బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 1.74 శాతం, మిడ్‌క్యాప్ 1.36 శాతం చొప్పున పెరిగాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)ల షేర్లు.. గురువారం ట్రేడింగ్‌లో తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) షేర్ విలువ 4.19 శాతం పుంజుకున్నది. అలాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) షేర్ విలువ 1.19 శాతం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) షేర్ విలువ 0.59 శాతం చొప్పున పెరిగాయి.