హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో క్యాటరింగ్ టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లు, సిబ్బంది కుమ్మక్కవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయి. నిర్వహణ గాలికి వదిలేయడంతో వరుసగా ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదవుతున్నట్టు సొసైటీ ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. నాసిరకం డైట్‌తో విద్యార్థులు సరిపెట్టుకోవాల్సి వస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్, ప్రభుత్వ విద్యాసంస్థలకు టెండర్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ నేతృత్వంలో పీఎంయూ (ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పీఎంయూనే ఆయా వస్తువుల నాణ్యత, ధరల ఖరారు, మార్గదర్శకాలను రూపొందిస్తుంది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు మొత్తంగా 9 రకాల వస్తువులకు, ఫుడ్ ప్రొవిజన్ (కిరాణా సామగ్రి) సప్లయ్ ఏజెన్సీలను కేంద్రీకృత విధానంలో పీఎంయూనే ఖరారు చేసింది. ఇక డైట్ ప్రొవిజన్ అంటే చికెన్, మటన్, కాయగూరల కొనుగోలు, అదేవిధంగా స్వీపింగ్, శానిటేషన్, వంట నిర్వహణ ఏజెన్సీల ఎంపికను డీపీసీ (డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ) ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో డీపీసీ చేపట్టిన టెండర్లలో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చాలా విద్యాసంస్థల్లో పాత కాంట్రాక్టర్లే కొనసాగుతుండడం అందుకు బలాన్ని చేకూర్చుతున్నది. విద్యాసంస్థ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఒకే కాంట్రాక్టర్‌కు రెండు కంటే ఎకువ పాఠశాలల్లో సరుకుల పంపిణీ కాంట్రాక్టు దకింది. ఇదే విషయమై లిఖిత పూర్వకంగా మంత్రి కార్యాలయానికే ఫిర్యాదులు రావడం గమనార్హం. మరీముఖ్యంగా ఆదిలాబాద్ , నిజామాబాద్ , కరీంనగర్ జిల్లాల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు తెలుస్తున్నది.
ప్రతి గురుకులంలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తంగా 640 మంది వరకు విద్యార్థుల ఉంటారు. పూర్తిస్థాయిలో సామర్థ్యం మేరకు విద్యార్థులు ఉన్నచోట క్యాటరింగ్ నిర్వహణకు(వంట నిర్వహణ) 8 మందిని నియమించాలి. లేదంటే 80 మందికి ఒక మనిషి చొప్పున నియమించాలి. అదేవిధంగా స్వీపింగ్ సంస్థ ప్రతి గురుకులంలో నలుగురు పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయాలి. స్వీపింగ్ సేవలకుగాను నెలకు రూ.40వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అందులో రూ. 4,500 ఫినాయిల్, ఇతర స్వీపింగ్ సామగ్రి ఖర్చులు పోను మిగతావాటితో సిబ్బంది వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులు కుమ్మక్కయి నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్యాటరింగ్ నిర్వాహకులు నిర్ణీత సంఖ్యలో మనుషులను నియమించకుండా అరకొరగా నియమించి కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఉన్న సిబ్బందిపై పనిఒత్తిడి విపరీతంగా పెరుగుతున్నది. ఫలితంగా వారు సైతం వంటపాత్రలను శుభ్రంగా కడుగకపోవడం, పరిశుభ్రత పాటించకుండా ఇష్టారీతిన వంట చేస్తూ మమ అనిపిస్తున్నారు. అంతిమంగా అది ఫుడ్‌పాయిజన్ ఘటనలకు దారితీస్తున్నది. సర్కార్ వైఫల్యమే ఫుడ్‌పాయిజన్ కేసులు పెరిగేందుకు కారణమని విద్యార్థి సంఘాలు సైతం నొక్కిచెప్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని, ఏజెన్సీలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్టీ బాలికల హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఆధ్వర్యంలో కేసును సుమోటోగా స్వీకరించారు. ఎస్టీ వసతి గృహంలో కలుషిత ఆహారం తీసుకోవడంతో 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టు వచ్చిన వార్తలపై కేసు నమోదు చేశారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, అస్వస్థతకు గురైన విద్యార్థినుల సంఖ్య, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వారికి అందించిన వైద్యం, బాధ్యులపై తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను కమిషన్ ఆదేశించింది. నివేదికను సెప్టెంబర్ 7వ తేదీలోగా సమర్పించాలని తెలుపుతూ కేసును వాయిదా వేశారు.