ఖమ్మం కమాన్‌బజార్, ఆగస్టు 4 : బతికుండి పోరాడుదామని, చనిపోయి సాధించేదేమీ లేదని ఖమ్మం నిరుద్యోగ యువకుడు వేణుకుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని, జాబ్ క్యాలెండర్ అమలుచేయడం లేదన్న కలతతో ఖమ్మం జిల్లా న్యూలక్ష్మీపురానికి చెందిన నిరుద్యోగ యువకుడు వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం దవాఖానలో చికిత్స పొందుతున్న వేణును బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. అక్కడి నుంచే కేటీఆర్‌కు ఫోన్ చేశారు.
వేణుతో కేటీఆర్ ఫోన్లో మాటాడుతూ ‘మీకు, యూత్‌కు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. కలిసి పోరాడుదాం’ అని ధైర్యం చెప్పారు. అందుకు వేణు స్పందిస్తూ ‘నేను నా ఒక్కడి కోసమే ఇది చేయలేదు సార్.. టోటల్ తెలంగాణ కోసం ఇలా చేసిన’ అని చెప్పాడు. కాంగ్రెస్ వాళ్లు బతుకనీయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. తనపై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయాడు. తనకు సొంత ఇల్లు లేకున్నా కక్షపూరితంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని తెలిపాడు.
కేటీఆర్: రాకేశ్రెడ్డీ.. ఫోన్లో వేణు ఉన్నాడా?
వేణు : నమస్తే సార్ బాగున్నారా?
కేటీఆర్: వేణు నమస్తే.. నేను బాగున్నా.. మీరు బాగున్నారా?
వేణు: కొంచెం పర్లేదు సార్. హాస్పిటల్లోనే ఉన్నా.. ఇప్పుడు కొంచెం కోలుకున్నా.
కేటీఆర్: కరెక్టేగానీ, అంత తొందరపాటు నిర్ణయం ఎందుకు చెప్పు?
వేణు: తొందరపాటు నిర్ణయం కాదు సార్ ఇది. మూడేండ్ల నుంచి జాబ్ క్యాలెండర్ కోసం ఎంతో పోరాడుతున్నా. ఈ రోజు వరకు కూడా ఓ జాబ్ క్యాలెండర్లేదు. ఏదీ లేదు. మాలాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంది సార్? ఇది నా ఒక్కడి కోసం కాదు. టోటల్ తెలంగాణ కోసం చేశాను. జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. ఆ పార్టీ వాళ్లంతా ఒక ఒక ముఠాలా తయారైండ్రు. ఆ పార్టీలో ఎవరితో మాట్లాడినా పిచ్చి బూతులు తిడుతున్నరు. చిన్న నాయకులూ అట్లనే ఉన్నరు. మా అమ్మ మానసిక వికలాంగురాలు. మాకు ఇల్లు లేదు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కనీసం మాకు ఇల్లు కూడా ఇవ్వలేదు సార్.
కేటీఆర్: అవునా.. మా వాళ్లు చెప్పారు నాకు.
వేణు: దివ్యాంగుల కోటాలో ఇల్లు ఇవ్వకుంటే ఎట్ల సార్? 17 ఏండ్ల నుంచి మేం ఇబ్బందులు పడుతున్నం. జాబ్ కొట్టందే మా లైఫ్ మారదని అనుకున్న. నోటిషికేషన్ల కోసం ఎదురు చూస్తున్న. కాంగ్రెస్ హామీ ఇచ్చి మాట తప్పింది. అందుకే నాతో ఎవరున్నా లేకపోయినా జాబ్ క్యాలెండర్ కోసమే చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్న. ఒకవేళ నేను బతికుంటే దానికోసమే పోరాడుదామని డిసైడ్ అయిన.
కేటీఆర్: వేణు ఒక్కమాట.. నీ లెటర్ మొత్తం చదివిన. చదివాకే ఎంతో చలించిపోయిన. ఎంతో బాధ అనిపించింది. కరెక్టుగా రెండేండ్లు నిండింది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.
వేణు: అవును సార్
కేటీఆర్: అందుకే నిన్న ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన. ‘మా వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు. ప్రభుత్వం మీద చార్జ్‌షీట్’ అని చెప్పి గట్టిగా మాట్లాడిన. నా రిక్వెస్టల్లా ఒక్కటే. బతికుండి పోరాడాలి కానీ చచ్చిపోయి సాధించేదేం లేదు.
వేణు: నేను అదే అనుకున్నా సార్. కానీ, కాంగ్రెస్ వాళ్లు బతకనియ్యట్లేదు కదా సార్.
కేటీఆర్: ఏం కాదు. మేమందరం ఉన్నాం కదా.. నీకు అండగా ఉంటం. ధైర్యంగా ఉండు.
వేణు: ఈ రోజంటే మీరు మాట్లాడారు. ఇన్ని రోజులు నాకు ధైర్యం లేదు. ఎలాంటి అవకాశం లేదు. ఎవరితో మాట్లాడుదామన్నా భయం. ఈ కాంగ్రెస్‌లో కింది వాళ్లు రెచ్చిపోతున్నరు. వాళ్లే కలెక్టర్లన్నట్టు ఫీలైపోతున్నరు. ఈ వ్యవస్థే సరిగా లేదు సార్.
కేటీఆర్: అవును.. ఒకసారి నువ్వు డిశ్చార్జి అయిన తర్వాత నేను ఖమ్మం వస్తా. ఒకసారి కలుసుకుందాం. తప్పకుండా నువ్వు అన్నట్టుగా జాబ్ క్యాలెండర్ కోసం, కాంగ్రెస్ వాళ్లిచ్చిన హామీల అమలు కోసం పోరాడుదాం. ఈ విషయంలో మీకంటే ఒక అడుగు ముందుంటాం. మీ అందరికీ అండగా నిలబడుతాం. ఆ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు. రెండోది.. నీకు మాటిస్తున్నా. నీ సూసైడ్ నోట్ ఏదైతే ఉన్నదో.. దాని ద్వారా తెలంగాణ యూత్ అందరికీ న్యాయం జరిగేదాకా నీ తరఫున బీఆర్ఎస్ కొట్లాడుతది. నీతోపాటు ఉంటది. మనం కచ్చితంగా మళ్లీ ప్రభుత్వంలోకి వస్తాం. వచ్చాక నీతోపాటు నీ నోటు ఆధారం చేసుకొని రేపటి రోజున యూత్‌కు న్యాయం చేసే బాధ్యత నాది.
వేణు : సరే సార్.
కేటీఆర్: రాకేశ్ అన్న మీతో టచ్‌లో ఉంటారు.
వేణు: అయితే నేను కూడా మరీ ఇంత డెసిషన్ తీసుకోవాలని అనుకోలేదు సార్. నేను ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటంటే.. మా అమ్మకు బైపోలార్. ఆమెకు నెలకు రూ.8 వేలు అవుతున్నయి. మాకు వచ్చే ఇన్కమ్ కూడా ఏమీలేదు.
కేటీఆర్: తప్పకుండా సాయం చేస్తా. రాకేశ్ అన్నకు చెప్తా. నేనే మిమ్నల్ని కలిసి సాయం చేస్తా.
వేణు: మీరైతే ఒకసారి కంపల్సరీ కలువాలి సార్ నన్ను.
కేటీఆర్: వస్తా. ఖమ్మం రాగానే కలుస్తా.
వేణు: థ్యాంక్యూ సో మచ్ సార్.
కేటీఆర్: థ్యాంక్యూ వేణూ..