Land Auction | ఒకవైపు ఇందిరమ్మ పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు స్థలాల్లేవంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరోవైపు సర్కార్ స్థలాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నది. పేదల ఇండ్లకు జాగ లేదని ఆపసోపాలు పడుతూనే.. మరోవైపు వేల ఎకరాల ప్రభుత్వ భూముల అమ్మకానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలోనే రేవంత్ సర్కార్ స్థలాలమ్మి సొమ్ము చేసుకున్న మొత్తం ఏకంగా రూ.30వేల కోట్లకు పైనే!
రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి స్థలాల అన్వేషణకు ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించింది. వివిధ విభాగాల కిందనున్న స్థలాలను గుర్తించడమే ఆ కమిటీ పని! అంటే ప్రభుత్వ స్థలాలను అమ్మేయాలె! ఇండ్ల నిర్మాణానికి భూమి లేదని శాఖల కిందనున్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలె! ఇదీ రేవంత్ సర్కార్ ప్లాన్!
మలక్‌పేటలో ఆర్‌అండ్‌బీకి చెందిన ఆరెకరాలు, నాంపల్లి, అంబర్‌పేట, రాజేంద్రనగర్‌లో పోలీసుశాఖకు చెందిన 20 ఎకరాలతోపాటు గ్రేహౌండ్స్‌కు చెందిన 80 ఎకరాల స్వాధీనానికి సర్కార్ యోచిస్తున్నది. భూదాహంతో తహతహలాడుతున్న ప్రభుత్వం.. ఇలా కన్నేసిన భూముల జాబితా మరింత పెరుగనున్నది.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభు త్వం ఆర్థిక వనరుల సమీకరణకు ప్రభుత్వ భూములను ఈ-వేలానికి పెడుతూనే, సంక్షేమ పథకాల కోసం భూమి కొరత ఉన్నదంటూ ఇతర ప్రభుత్వ శాఖల స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయడం కొత్త చర్చకు దారితీసింది. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీజీఐఐసీ, హెచ్ఎండీఏ, హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా వరుస భూముల వేలాలు నిర్వహించగా, ఖరారైన లావాదేవీల ద్వారానే రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరిందని లెకలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం భూముల గుర్తింపునకు కమిటీ ఏర్పాటు చేసి, మలక్‌పేటలోని ఆర్ అండ్
బీ, నాంపల్లిలోని పోలీసు క్వార్టర్స్, అంబర్‌పేటలోని పోలీసులైన్స్, రాజేంద్రనగర్‌లోని గ్రేహౌండ్స్ స్థలాలు తదితర ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ సాగుతున్నది. ఎన్నికల సమయంలో పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. ఇండ్ల నిర్మాణానికి స్థలాలు లేవనే సాకుతో రాష్ట్రంలో ‘డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్థల సేకరణ కమిటీ’ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని చైర్మన్‌గా, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్‌ను సభ్యులుగా నియమించింది. అధికారికంగా ఈ కమిటీ లక్ష్యం పేదలకు ఇండ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించడం. కానీ, ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న పరిణామాలు మాత్రం వేరే చిత్రాన్ని చూపిస్తున్నాయి. కొత్తగా భూములను కొనుగోలు చేయడం గానీ, భూసేకరణ చేపట్టడం గానీ కాకుండా ఇప్పటికే ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న విలువైన స్థలాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తున్నది.
ప్రభుత్వ శాఖల భూములను ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేసే ప్రక్రియ వేగంగా సాగుతున్నదని సమాచారం. ఇందులో భాగంగా మలక్‌పేటలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన సుమారు ఆరు ఎకరాల భూమిని డబుల్ బెడ్రూమ్ అవసరాల కోసం స్వాధీనం చేసుకొనే ప్రతిపాదనలు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. నాంపల్లి పోలీసు క్వార్టర్స్‌లోని నాలుగు ఎకరాలు, అంబర్‌పేట పోలీసులైన్స్లోని పది ఎకరాలు, రాజేంద్రనగర్‌లోని గ్రేహౌండ్స్‌కు చెందిన ఆరు ఎకరాల భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో గ్రేహౌండ్స్‌ను పూర్తిగా రద్దు చేసి లేదా కుదించి, ఆ విభాగానికి చెందిన 80 ఎకరాల అత్యంత విలువైన భూమిని స్వాధీనం చేసకొనేందుకు వేగంగా ఫైళ్లు కదులుతున్నట్టు తెలిసింది. శాంతిభద్రతలకు వెన్నెముక లాంటి బలగాలకు చెందిన భూములను వ్యాపారానికి వాడుకోవడం పట్ల పోలీస్ కానిస్టేబుళ్లు, అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రతిఘటనను దారి మళ్లించడానికి గాజులరామారంలోని వివాదాస్పదమైన 60 ఎకరాల భూమిని అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
డిసెంబర్ 2023 నుంచి ఆగస్టు 2026 వరకు టీజీఐఐసీ, హెచ్ఎండీఏ, హౌసింగ్ బోర్డుల ద్వారా ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటల వివరాలు పరిశీలిస్తే, ప్రభుత్వ భూ దాహం ఏ స్థాయిలో ఉన్నదో అర్ధమవుతుంది. రాయదుర్గం (నాలెడ్జ్ సిటీ)లో అక్టోబర్ 2025లో 18.67 ఎకరాల భూమిని రెండు ప్లాట్లుగా వేలం వేశారు. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఎకరాకు రూ.177 కోట్ల చొప్పున రూ.1,357.59 కోట్లుతో 7.67 ఎకరాలను కొనుగోలు చేసింది. ప్రెస్టీజ్ గ్రూపు ఎకరాకు రూ.141.5 కోట్ల చొప్పున రూ.1,556.50 కోట్లతో 11 ఎకరాలను కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీతో కలిపి ప్రభుత్వానికి మొత్తం రూ.3,135 కోట్ల ఆదాయం వచ్చింది. రాయదుర్గంలో జూన్ 2026లో 6.29 ఎకరాల భూమిని ఎకరాకు ఆల్-టైమ్ రికార్డు ధర అయిన రూ.237 కోట్లకు విక్రయించగా, ప్రభుత్వానికి రూ.1,490 కోట్ల ఆదాయం లభించింది. అయితే, ఈ 6.29 ఎకరాల్లోని 5 ఎకరాలు తమకు 2010లోనే కేటాయించారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వేలం తీవ్ర వివాదాస్పదమైంది. 2024 జూన్ 26న జీవో-54 ద్వారా ఎకరాకు రూ.75 కోట్ల చొప్పున రూ.30,000 కోట్ల విలువైన 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించారు. వేలం నిర్వహించకముందే డిసెంబర్ 2024లో టీజీఐఐసీ ఈ భూమిపై ఎన్సీడీల ద్వారా రూ.10,000 కోట్లు అప్పు తెచ్చింది. దీనికి పదేండ్లలో రూ.15,776.93 కోట్లు వడ్డీతో కలిపి చెల్లించాలి. ప్రస్తుతం ఈ భూమి అటవీ భూమి పరిధిలోకి వస్తుండటంతో కోర్టు వివాదంలో చికుకొని వేలం నిలిచిపోయింది.
2025 నవంబర్ 24న హెచ్ఎండీఏ కోకాపేటలోని నియోపొలిస్‌లోని 9.9 ఎకరాలను వేలం వేయగా రూ.1,356 కోట్లు వచ్చాయి. 2025 నవంబర్ 28న 9.06 ఎకరాలను వేలం వేయగా రూ 1,352 కోట్లు వచ్చాయి. ఈ రెండు దఫాల వేలాల ద్వారా కోకాపేట నియోపొలిస్ ఒక ప్రాంతం నుంచే హెచ్ఎండీఏ రూ.3,708 కోట్ల రాబడిని పిండుకున్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూసాపేట (14.66 ఎకరాలు – బేస్ ధర రూ.75 కోట్లు), గోల్డెన్ మైల్ (1.98 ఎకరాలు – బేస్ ధర రూ.70 కోట్లు) ప్రాంతాల్లోని విలువైన భూములను కూడా వేలానికి పెట్టారు. ఆమోదించిన రుణ ప్రణాళికల ద్వారా 18 నెలల్లో రూ.20,000 కోట్లు సమీకరించేందుకు బాండ్లు జారీ చేసింది. కరీంనగర్, ఖమ్మం, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని 41 లే ఔట్లలో దాదాపు 1,400 ఖాళీ ప్లాట్లు, 361 అసంపూర్తి ఇండ్లను వేలానికి పెట్టారు. బండ్లగూడ, పోచారం, నాగోల్, జవహర్‌నగర్, గాజులరామారంలో 2007 నుంచి అమ్ముడుపోని 700 ఫ్లాట్లను అమ్ముతున్నారు. చింతల్లో 513 గజాల హెచ్ఐజీ ప్లాటు గజానికి రూ.1.14 లక్షల రికార్డు ధరకు విక్రయించారు. హౌసింగ్ బోర్డు ద్వారా మొత్తం రూ. 3,500 కోట్ల రాబడి లక్ష్యంగా పెట్టుకున్నారు.