జీవితమే ఒక ప్రయాణం. మహా కావ్యాల్లో చిన్న చిన్న పిట్టకథలున్నట్టే… సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని చిన్న చిన్న విహారాలు ఉండాలి.కుటుంబం, వృత్తికే అంకితమైన రెగ్యులర్ లైఫ్‌లో రిఫ్రెష్మెంట్ కోసం కొద్ది రోజులు ట్రావెల్ చేయాలి. ఆ పర్యాటక సంతోషాల్ని మూటగట్టుకుని పెద్ద బాధ్యతల జీవితాన్ని విజయం వైపు నడిపించవచ్చు. కొత్త చోటుకే కాదు కొత్త వాళ్లతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా ఓ మంచి జీవితానుభవం. ఒకరు చెప్పే అనుభవాలు మిగతావారికి పాఠాలు. కొత్త ప్రయాణాలు తీపి జ్ఞాపకాలు. మరపురాని మజిలీలు చేయాలంటే పర్యాటకులతో చేయి చేయి కలిపి సాగిపోవాలి. కొత్త ప్రపంచం చూసి రావాలి.
ఉరుకుల పరుగుల జీవితాల్లో మనసుకు విశ్రాంతి సరిపోదు. విశ్రాంతితోపాటు పునరుత్తేజం కావాలి. అది రావాలంటే కొంత కాలాన్ని ఉత్సాహంగా గడపాలి. కొత్తదారిలో అడుగేసి సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాలి. హిమాలయాల్లాంటి ఎత్తైన పర్వతాలకో, కన్యాకుమారి వంటి సముద్ర తీరాలకో ప్రయాణించాలి. ప్రకృతి అందాలు చూస్తూ, సాహసాలు చేస్తూ, కొత్త స్నేహాలు పెంచుకుంటూ కొద్ది రోజులు కలిసి తిరగాలి. గంటలు నిమిషాల్లో సాగే యాత్రలు దశాబ్దాలు గడిచినా చెరగని ఆనందాలిస్తాయి. అందమే ఆనందం అన్నట్టు ప్రకృతి సోయగాలు మనసుకే కాదు శరీరానికీ శక్తినిస్తాయి. అందుకే అలసినప్పుడు, కొత్త శక్తిని కూడగట్టుకోవాలనుకున్నప్పుడు ప్రయాణాలు మొదలుపెట్టాలి.
విహారంలో సగం!
అనుకున్నప్పుడల్లా ఆఫీసుకు సెలవులు దొరుకుతాయి. కానీ, పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలు ఆడవాళ్ల కాళ్లకు బంధాలేస్తాయి. ఎంత చాకిరి చేసినా కొద్ది రోజులు ఆ బాధ్యతను తప్పించుకోలేరు. పర్యాటకానికి, ప్రపంచానికి దూరంగా ఉండే ఆడవాళ్లకు ఇల్లే లోకం. ఆ లోకంలో ఉండే ఆడవాళ్ల ఆశలకు రెక్కలు తొడిగి, అందాల ప్రకృతిలో విహరింపజేస్తూ కొత్త పర్యాటక బృందాలు ఏర్పడ్డాయి. వీటి స్థాపకులంతా మహిళలే. నిర్వాహకులూ మహిళలే. ఒకప్పుడు కుటుంబ సభ్యులు లేకుండా కొత్త వ్యక్తులతో ప్రయాణాలకు మహిళలు వెనకడుగు వేసేవాళ్లు. భద్రత కోసం కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుంటే ఇంట్లో పిల్లలు, పెద్దల బాధ్యతలు చూసుకునేవాళ్లు ఉండరు. బయటి ప్రపంచాన్ని చూసి రావాలని కోరుకునే ఆలోచనల్ని ఇంటి బాధ్యతలు ఎప్పుడూ కట్టడి చేస్తూనే ఉండేవి. మహిళలకు మాత్రమే ఉండే ప్రత్యేకమైన పరిస్థితులను గుర్తించి వాళ్ల కోసమే విహారాలు నిర్వహించే పర్యాటక సంస్థల రాకతో ‘విహారంలో సగం’ నిజమయ్యే దిశగా ప్రయాణిస్తున్నారు.
వావ్ క్లబ్
పర్యటన అనగానే ప్రకృతి, ప్రత్యేకతలు, రోజులు, విడిది, బడ్జెట్ మాత్రమే ఎక్కడైనా కనిపిస్తుంది. కానీ, భద్రత ప్రస్తావనే ఉండదు. ఒంటరిగా ట్రావెల్ చేయడానికి మహిళలకు అనుమతి ఉండదు. ఇలాంటి ప్రత్యేకమైన స్థితిలో ‘మహిళలకు మాత్రమే’ నిర్వహించే పర్యాటక యాత్రలు భరోసాని, కుటుంబ సభ్యులకు నమ్మకం కలిగిస్తున్నాయి. పర్యాటకుల్లో ఎక్కువగా కనిపించే పురుషులు, కుటుంబ సభ్యులను ఆసరా చేసుకుని వచ్చే ఒకరిద్దరు మహిళలను చూసిన తర్వాత మహిళల కోసమే పర్యాటక సంస్థల అవసరముందని సుమిత్రా సేనాపతి అర్థం చేసుకుంది. ‘వావ్ క్లబ్’ని స్థాపించింది. దేశంలోని ప్రకృతి అందాలు, అధ్యాత్మిక క్షేత్రాలు, సోలో ట్రావెల్, ట్రెక్కింగ్‌ని ఉత్సాహవంతులైన మహిళలకు పరిచయం చేసింది. ఈ ప్రయాణం దేశం దాటి ఖండాంతరాలకు విస్తరించింది. ఒక్క రోజు ప్రయాణానికి కూడా తోడులేనిదే గడపదాటని మహిళలు విదేశాలు చూసిరావాలనే కోరిక నెరవేర్చింది. ఆయా భౌగోళిక ప్రాంతాల వాతావరణం, వేడుకలను గుర్తించి యాభై పర్యాటక ప్రాంతాలకు మహిళల కోసం ట్రావెల్ ఈవెంట్స్ చేపడుతున్నది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, లద్దాఖ్‌లో ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నది. ఇరవై ఏండ్లుగా వావ్ క్లబ్ నిర్వహిస్తున్న ట్రావెల్ ఈవెంట్స్ మరెందరికో స్ఫూర్తినిచ్చింది.
ద వండరర్ గర్ల్స్
సోలో ట్రావెల్ ఇష్టపడే యువతుల కోసం ఈ సంస్థ విదేశీ మహిళా పర్యాటక సంస్థలతో కలిసి పనిచేస్తున్నది. ఒక లేడీ ట్రావెలర్ మరో లేడీ ట్రావెలర్‌తో పరిచయం ఏర్పరుచుకునేందుకు, కలుసుకునేందుకు, కలిసి ప్రయాణించేందుకు ఈ సంస్థ సహకరిస్తుంది. నేచర్ స్పాట్స్, చారిత్రక కట్టడాల సందర్శన, సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, స్థానిక రుచులు ఆరగించేందుకు, షాపింగ్ కోసం లేడీ ట్రావెలర్స్‌కి సహకారం అందిస్తుంది.
బియాండ్ ట్రావెల్
ప్రపంచ దేశాల సంస్కృతులు, సంగీతం, వేడుకలు చూసి రావడానికి కావాల్సిన ట్రావెల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నది బియాండ్ ట్రావెల్ సంస్థ. పర్యాటకంలో సంస్కృతి, కళలు, సంగీతం, ఆహారం చాలా ప్రధానమైనవి. పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందించేలా రిచ్ కల్చర్, టేస్టీ ఫుడ్, వండర్ఫుల్ నేచర్ చుట్టూ కొత్త ప్రయాణాలకు రూపకల్పన చేస్తూ ఉంటుంది.
వండరింగ్ జానె
సముద్ర తీరాలు, మంచు పర్వతాలు చల్లని గాలితో ఆహ్లాదం కలిగిస్తాయి. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో శరీరం కాస్త అలసిపోతే ప్రశాంతంగా సేద తీరవచ్చు. తీరాల్లో పరుగు, పర్వతాల్లో నడకతో దేహాన్ని కొంచెం కష్టపెట్టి, మనసుని సంతోషపెట్టే ట్రావెలర్స్‌కి వండరింగ్ జానె గోవా, కేరళం, లద్దాఖ్, సింగపూర్, బాలీలకు ట్రావెల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నది.
వండర్ వుమేనియా
ఉత్సాహం ఉరకలెత్తే అమ్మాయిల కోసం వండర్ వుమేనియా సోలో ఈవెంట్స్ నిర్వహిస్తున్నది. తక్కువ బడ్జెట్లోనే దేశ, విదేశాల్లో పర్యటించే వెసులుబాటు కల్పిస్తున్నది.
ద ఫ్లాపర్ లైఫ్
నలుగురు అమ్మాయిలు కలిసి బయటికి పోవాలనుకుంటారు. క్లాస్మేట్స్, హాస్టల్మేట్స్, ఫ్రెండ్స్‌తో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే అమ్మాయిలకు ద ఫ్లాపర్ లైఫ్ బెస్ట్ ట్రావెల్ మేనేజ్మెంట్ కంపెనీ. సోలో ట్రావెలర్స్ కూడా వీళ్లతో చేరి ప్రయాణించవచ్చు.
ఎఫ్5 ఎక్సేప్స్
మహిళల నాయకత్వంలో ప్రయాణాలు, మహిళా గైడ్లతో పర్యాటకం నిర్వహిస్తుంది ఎఫ్5 ఎక్సేప్స్. కుటుంబసభ్యులతో కలిసి, సంస్థల్లోని మహిళలంతా కలిసి కూడా ఈ సంస్థ సహకారంతో పర్యటించి రావొచ్చు. వీళ్లతో సోలో ట్రావెలర్స్‌ని కూడా కలుపుకొంటారు. కచ్, ఇతర ప్రాంతాల్లో మహిళా బైక్ రైడర్స్ కోసం మోటార్ బైక్ రైడ్స్ కూడా నిర్వహిస్తున్నది.