కొంతమంది తమ స్థాయికి మించి త్యాగం చేస్తూ ఉంటారు. ఎదుటివారికి సలహాలు, మానసిక ధైర్యం, డబ్బు, సమయం వంటి ఎన్నో అవకాశాలను అందిస్తారు. తాము అలసిపోయినప్పటికీ ఇతరులకు సాయం చేయడం మాత్రం మరువరు. కానీ, కాలక్రమేణా ఆ అలసటే ఒక దయగా మారిపోతుంది. అలాంటి వారికి శ్రీకృష్ణుడి ఉపదేశం ఒక స్పష్టమైన పాఠాన్ని నేర్పుతుంది. ‘అందరినీ సంతోషపెట్టే క్రమంలో మీ ప్రశాంతతను కోల్పోకండి!’ అని భగద్గీతలో శ్రీకృష్ణ పరమ్మాతుడు చెప్పిన మాటలు.. ఈ సమాజానికి సరిగ్గా సరిపోతాయి. మంచి చేయడం తప్పనిసరే కానీ, ఇతరుల కోసం మిమ్మల్ని మీరు త్యాగం చేసుకోవడం ధర్మం అనిపించుకోదు. నిజమైన సేవ అనేది శక్తి నుంచి రావాలి కానీ భయం, అపరాధ భావం, ఇతరుల మెప్పు పొందాలనే కోరిక నుంచి కాదు. మీ మనసు విశ్రాంతి కోసం తపిస్తున్నప్పుడు కూడా పదేపదే ఇతరులకు సహాయం అందించేందుకు ఆలోచిస్తున్నారంటే.. ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే.
అతి వద్దు: ఎకడైతే హద్దులు ఉండవో, అకడ సాయం చేయడం బాధ్యతగా కాకుండా బాధగా మారుతుంది. మీరు ఒకరికి వరుసగా సాయం చేస్తూ ఉంటే, వారు దానికి అలవాటు పడిపోతారు. మీరు ఒకరికి మానసికంగా తోడుగా ఉండొచ్చు. కానీ, మీకు అవసరం వచ్చినప్పుడు వారు అందుబాటులో లేకపోవచ్చు. ఇది చివరికి మౌన వేదనకు దారితీసి, మీకు మీరే మోసపోయినట్లుగా, నిర్లక్ష్యానికి గురైనట్లుగా భావిస్తారు. అయినప్పటికీ, మిమ్మల్ని స్వార్థపరుడని ఇతరులు అనుకుంటారేమోనన్న భయంతో సత్తువలేకున్నా సాయం చేస్తూనే ఉంటారు. దయకు జ్ఞానం తోడుగా ఉండాలి. మంచి మనసు ఉండటం అమూల్యమైనదే కానీ, అది అధర్మానికి, అన్యాయమైన కోరికలకు తలవంచకూడదు.
సరైన మార్గం కాదు: అందరి బాధ్యతలను మీ నెత్తిపై వేసుకోకూడదు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత బాధ్యతలుంటాయి. ఇతరులు చేసే తప్పుల పర్యవసానాల నుంచి వారిని కాపాడటం మీ పని కాదు. మంచిగా జీవించడమే మీ బాధ్యత. మీ సాయం ఇతరుల ఎదుగదలకు ఉపయోగపడినప్పుడు మాత్రమే అది మంచిది. ఒకవేళ మీ సాయం వల్ల అవతలివారు నిర్లక్ష్యంగా మీపైనే ఆధారపడినా లేదా డిమాండ్ చేసేలా మారుతున్నా ఆ సాయం చేయడం సరైనది కాకపోవచ్చు. ఎవరికైనా సాయం చేసేముందు ‘నేను ఇది నిజమైన ప్రేమతో చేస్తున్నానా? ఇతరుల మెప్పుకోసం చేస్తున్నానా?’ అనే ప్రశ్నలువేసుకోండి. అసలు నిజం బయట పడుతుంది.
ఒకే ఒక మాట: నేను దయతో సాయం చేస్తాను. కానీ, నా ప్రశాంతతను పణంగా పెట్టి మాత్రం కాదు.. అనే ఈ ఒక్కమాటను మీ డైరీలో రాసిపెట్టుకోండి. ఈ ఆలోచన మీ జీవితంలో ప్రశాంతతను నింపుతుంది. ఇతరుల శ్రేయస్సు ఎంత ముఖ్యమో, మీ మానసిక శక్తి కూడా అంతే ముఖ్యమని ఇది గుర్తుచేస్తుంది. ఆత్మ నిర్లక్ష్యాన్ని మంచితనంగా అనుకోవద్దు. దయతో సేవ చేయండి, కానీ సమతుల్యతను మరవకండి.