ఇల్లెందు, సెప్టెంబర్ 23 : న్యాయవాద రక్షణ చట్టం అమలుకై ఇల్లెందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇల్లెందు కోర్టు ఆవరణంలో మంగళవారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో న్యాయవాదులపై దాడులు పరిపాటిగా మారాయన్నారు. అనునిత్యం కక్షిదారుల కోసం వివిధ వర్గాల ప్రజల కోసం పాటుపడే న్యాయవాదులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో న్యాయవాద రక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపు మేరకు ఇల్లెందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మున్ముందు న్యాయవాదులపై దాడులకు పాల్పడితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, సీనియర్ న్యాయవాదులు ఎస్.వెంకటేశ్వర్లు ఎన్.మల్లికార్జునరావు, పి.బాలకృష్ణ , ఎస్.వెంకట నరసయ్య, పి.వెంకట నరసయ్య, మామిడి సత్య ప్రకాష్, పైల జయప్రకాష్, పి.అనిల్ కుమార్, సిహెచ్ నవీన్ కుమార్, పి.ధనుంజయ్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎస్.రంగనాథ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, జాఫర్ హుస్సేన్, లలిత కుమార్ పాల్గొన్నారు.