KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘తాల్ హాస్పిటల్స్ హెల్త్‌ఫెస్ట్ 2025’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని తాల్ హాస్పిటల్స్ సీఈఓ శ్రీ సాయి గుండవెల్లి హైదరాబాద్‌లో కేటీఆర్‌కు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ సాయి గుండవెల్లి వెంట ఉన్నారు.
అక్టోబర్ 24, 2025న కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో (UCSD)లో ఈ ‘హెల్త్‌ఫెస్ట్ 2025’ నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు, మార్పు తీసుకొచ్చేవారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణపై చర్చించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వ్యక్తిగత వైద్యం, డిజిటల్ హెల్త్‌కేర్ ఆవిష్కరణలు, సమీకృత వైద్య సంరక్షణ, ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలకు మార్గాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు.
ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో కేటీఆర్ కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. తెలంగాణలో టెక్నాలజీ ఆధారిత పాలన, ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి, ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన విధానాలు ప్రపంచ ప్రజలకు ఎంతో విలువైనవిగా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఆహ్వానాన్ని కేటీఆర్ అంగీకరించినందుకు టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపింది. హెల్త్‌ఫెస్ట్ 2025లో ఆయన భాగస్వామ్యం ఈ వేదికపై అర్థవంతమైన చర్చలకు దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.