భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 02 : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో నూతన కలెక్టర్ అంకిత్ తొలి రోజు ప్రజావాణి నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు అధికారులు అందరూ హాజరు కావాలని అంతకుక్రితం రోజే ప్రకటన జారీ చేశారు. అయినా 11 గంటల వరకు సైతం కొద్దిమంది జిల్లా అధికారులు మాత్రమే ప్రజావాణికి హాజరయ్యారు. ఎప్పటిలాగే పలువురు అధికారులు హాజరు కాలేదు. అప్పటికే 11 దాటడంతో అధికారుల నుండి అటెండెన్స్ తీసుకోమని కలెక్టర్ ఆదేశించారు. దీంతో వచ్చిన వారు, వివిధ శాఖల అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సంతకాలు పెట్టారు. ఇది గమనించిన కలెక్టర్ జిల్లా అధికారులు మాత్రమే సంతకాలు పెట్టిన షీట్ ఇవ్వాలని చెప్పడంతో అధికారులు తడబడి అప్పటికప్పుడు వేరే షీట్‌పై సంతకాలు చేసి మధ్యాహ్నం 12 గంటల్లోపు అటెండెన్స్ షీట్‌ను కలెక్టర్‌కు చేరవేశారు.
అనంతరం కలెక్టర్ వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలకు తగు పరిష్కారాలు సూచించారు. అనంతరం కలెక్టర్ స్పందిస్తూ.. ప్రతీ అధికారి తప్పనిసరిగా ప్రజావాణికి హాజరు కావాలన్నారు. తప్పని పరిస్థితి అయితే ముందుగా అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన. హోసింగ్ పీడీ రవీంద్రనాథ్, ఆర్డీఓ మధు. డీపీఓ దిలీప్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తొలి రోజు ప్రజావాణిలో అధికారులకు కలెక్టర్ అంకిత్ ఝలక్