– సర్వే ప్రక్రియను పరిశీలించిన కమిషనర్, తాసీల్దార్
ఖమ్మం రూరల్, ఆగస్టు 15 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు ఇందిరమ్మ కాలనీలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక సర్వే చేపట్టారు. గత కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కాలనీలో విస్తృత పర్యటన చేసిన సంగతి తెలిసింది. పర్యటన జరిగిన కొద్ది రోజులకే అధికారులు సర్వే చేపట్టడం ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ సిబ్బంది బృందాలుగా విడిపోయి వీధులలో నిర్మాణం జరిగిన ఇండ్లు, ఖాళీ స్థలాల వివరాలను సేకరించారు. ఈ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, రూరల్ తాసీల్దార్ వినయంధర్ రెడ్డి పర్యవేక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చిన 18 ఏళ్ల తర్వాత మున్సిపల్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టడం ఆసక్తికరంగా మారింది. ఒక్కసారిగా కాలనీలో ఇంటింటి సర్వే చేపట్టడంతో ఇప్పటికే ఇతర వ్యక్తుల వద్ద స్థలాలు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన కనపడింది.
అయితే ఈ నెల 17వ తేదీ నుండి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 23వ వార్డుతో పాటు వెంకటగిరి, గుడిమల్ల ఏరియాలో ఉన్న ఇందిరమ్మ కాలనీ ఫేస్ వన్, ఫేస్ టు లలో పూర్తి స్థాయి సర్వే చేపట్టడం జరుగుతుందని అధికారులు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశాల మేరకు ఎంజాయ్మెంట్ సర్వే చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఎంతమందికి పట్టాలు ఇచ్చారు, స్థలాలు ఎన్ని, కొనుగోలు చేసిన వారు ఎవరు అని వివరాలు సేకరించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. అనంతరం తుది నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. కాలనీలో నివసించే పేద ప్రజలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఉద్దేశంతో సర్వే ప్రక్రియ చేపట్టడం జరిగిందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి, వార్డుల ఆఫీసర్లు, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.