రుద్రంపూర్, ఆగస్టు 15 : “ఆరోగ్యమే మహాభాగ్యం. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుల్లో, క్రీడల్లో అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు” అని రుద్రంపూర్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ బుంగ వెంకటరమణ అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని రుద్రంపూర్ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి వసతి సరిగా లేకపోవడాన్ని గమనించిన ఆయన తన సొంత ఖర్చులతో రూ.26 వేల వ్యయంతో కమర్షియల్ మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు. శనివారం ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ, పిల్లలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం సామాజిక బాధ్యతగా భావించినట్లు తెలిపారు. హెచ్ఎం బాలాజీ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ బుంగ వెంకటరమణ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రంపూర్ సర్పంచ్ కేస్లీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.